Telugudesam: సీరియస్ గా మారిన డేటా చౌర్యం కేసు... ఏపీ, టీఎస్ పోలీసుల మధ్య వార్!

  • టీడీపీ ఐటీ సేవల సంస్థ 'ఐటీ గ్రిడ్' సంస్థపై దాడులు
  • టీఎస్ పోలీసుల సోదాలు... వెంటనే వచ్చేసిన ఏపీ పోలీసులు
  • ఉద్రిక్తత లేదన్న సజ్జన్నార్

తెలుగుదేశం పార్టీకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సేవలు అందిస్తున్న 'ఐటీ గ్రిడ్' సంస్థ హైదరాబాద్ కార్యాలయంపై తెలంగాణ పోలీసుల దాడులు తెలుగు రాష్ట్రాల పోలీసు వ్యవస్థల మధ్య యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. టీడీపీ కార్యకర్తల వివరాలున్న సర్వర్లను ఓపెన్ చేయాలంటూ తెలంగాణ పోలీసులు పట్టుబట్టగా, విషయం తెలుసుకున్న ఏపీ పోలీసులు హుటాహుటిన ఆ ప్రాంతానికి రావడంతో అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది.

 ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని టీడీపీ బహిర్గతం చేస్తోందని తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయగా, ఇది ఎన్నో సంవత్సరాలుగా నడుస్తోందని, తమ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరిని కలుస్తున్నారు? ఎవరు ప్రజలతో ఎక్కువగా మమేకం అవుతున్నారు? అన్న వివరాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తూ, వారిని ప్రోత్సహిస్తున్నామని, ఆ వివరాలు తెలంగాణ పోలీసులకు ఎందుకని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

ఇక ఇదే విషయంలో సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ స్పందిస్తూ, ఐటీ గ్రిడ్‌ ద్వారా లక్షల మంది ప్రజల వ్యక్తిగత డేటా బహిర్గతమవుతోందని తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. దీనిపై ఇండియన్ పీనల్ కోడ్ లోని 120బి, 379,420, 188, ఐటీ చట్టంలోని 72, 66 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ వ్యవహారంలో 'ఐటీ గ్రిడ్స్‌' సంస్థ యాజమాన్యాన్ని నిందితులుగా చేర్చామని, సంస్థపై సోదాలు కొనసాగుతున్నాయని అన్నారు. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రిక్త వాతావరణం లేదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News