Rahul Gandhi: డియర్ పీఎం.. సిగ్గుగా అనిపించడం లేదూ?: మోదీపై రాహుల్ ఫైర్

  • రాఫెల్ జెట్స్ లేని లోటు తెలుస్తోందన్న మోదీ
  • అవి ఆలస్యం కావడానికి మీ ఒక్కరిదే బాధ్యతన్న రాహుల్
  • అభినందన్ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేశారన్న కాంగ్రెస్ చీఫ్

పాక్ ఉగ్రవాదులపై దాడులు జరిపిన సమయంలో మన వద్ద రాఫెల్ యుద్ధ విమానాలు ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై  కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. ‘‘డియర్ మోదీ.. మీకు ఇప్పటికీ సిగ్గుగా అనిపించడం లేదా?’’ అని తీవ్ర పదజాలంతో ఫైరయ్యారు. రూ.30 వేల కోట్లను దొంగిలించి మీ స్నేహితుడు అనిల్‌కు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు.

రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కు రావడం ఆలస్యం కావడానికి పూర్తి బాధ్యత మీ ఒక్కరిదేనని మోదీని ఉద్దేశించి ఆరోపించారు. ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ లాంటి పైలట్లను కాలం చెల్లిన యుద్ధ విమానాల్లో పంపి వారి ప్రాణాలను ప్రమాదంలో పడేసేంత ధైర్యం మీకెక్కడిదని రాహుల్ సూటిగా ప్రశ్నించారు.

‘ఇండియా టుడే’ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. రాఫెల్ యుద్ద విమానాలపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, మొన్న పాకిస్థాన్‌పై దాడిచేసినప్పుడు ఆ విమానాలు మన వద్ద ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ప్రధాని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రాహుల్ ఇలా విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు.

More Telugu News