India: జైషే శిబిరంపై దాడి జరిగింది... ఒప్పుకున్న మసూద్ అజర్ సోదరుడు

  • బాలాకోట్ లో భారత విమానాలు దాడిచేశాయి
  • ఐఎస్ఐ, ఆర్మీ జోలికి వెళ్లలేదు
  • జైష్ ను లక్ష్యంగా చేసుకునే దాడులు

ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రయిక్స్-2లో భారత వాయుసేన విమానాలు పాకిస్థాన్ లో ప్రవేశించి బాలాకోట్ లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద శిక్షణ శిబిరాన్ని నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ భీకర దాడిలో 350 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారు. అంతర్జాతీయంగా ఈ దాడులు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ దాడులు జరిగింది తమపైనే అని ఇప్పటివరకు  ఎక్కడా ప్రకటించలేదు. అయితే జైషే అధినేత మసూద్ అజర్ తమ్ముడు మౌలానా అమర్ భారత యుద్ధ విమానాలు బాలాకోట్ లోని జైషే స్థావరంపై దాడులు చేశాయని తెలిపాడు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ ను ప్రస్తుతం ఓ భారత మీడియా సంస్థ సేకరించింది.

అందులో... భారత యుద్ధ విమానాలు ఐఎస్ఐ స్థావరాలు, ఆర్మీ పోస్టుల జోలికి వెళ్లకుండా బాలాకోట్ లో ఉన్న జైషే మహ్మద్ శిబిరంపైనే దాడులు చేశాయని వేరొకరితో చెబుతున్నట్టుగా ఉంది. అంతేకాదు, భారత వింగ్ కమాండర్ ను విడుదల చేసినందుకు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై తీవ్ర విమర్శలు చేయడం కూడా ఆ ఆడియో రికార్డింగ్ లో వెల్లడైంది. "భారత విమానాలు మరే ఇతర ఏజెన్సీలపైనా, వాటి ప్రధాన కార్యాలయాలపైనా దాడులు చేయలేదు. జిహాద్ భావన గురించి శిక్షణ పొందుతున్న విద్యార్థులపై మాత్రం బాంబుల వర్షం కురిపించాయి" అంటూ అమర్ ఆ ఆడియో క్లిప్ లో పేర్కొన్నాడు.

More Telugu News