India: ఉగ్రవాద కార్యకలాపాలకు మా భూభాగాన్ని ఉపయోగించుకోనివ్వం!: ప్రతినబూనిన పాకిస్థాన్

  • జైషే మహ్మద్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోంది
  • భారత్ చర్చలకు రావాలి
  • పాక్ విదేశాంగ మంత్రి ప్రకటన

మొన్నటికి మొన్న సర్జికల్ స్ట్రయిక్స్ పై స్పందిస్తూ ఓ పాకిస్థాన్ మంత్రి "చీకటిగా ఉంది, లేకపోతేనా..!" అంటూ హాస్యాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. పట్టపగలు, మిట్టమధ్యాహ్నం అయితే భారత్ ను దీటుగా ఎదుర్కొనేవాళ్లమన్నది ఆయన భావన! ఇప్పుడు మరో మంత్రి కూడా ఇంచుమించు అలాంటి వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మెహమూద్ ఖురేషి నమ్మశక్యం కాని వ్యాఖ్యలతో భారత వర్గాలను ఆశ్చర్యానికి గురిచేశారు. పాకిస్థాన్ గడ్డపై ఉగ్రవాద కార్యకలాపాలను అనుమతించబోమని, భారత్ సహా మరే దేశంపై అయినా తమ గడ్డపై నుంచి ఉగ్రదాడులను సహించబోమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ కీలక కేంద్రాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని తెలిపారు.

ఇక, పుల్వామా దాడి ఘటనలో జైషే ప్రత్యక్ష ప్రమేయం ఉందని నిరూపిస్తూ భారత్ సాక్ష్యాధారాలను అందించిందని, దీనిపై భారత్ చర్చలకు ముందుకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు ఖురేషి. అయితే, పుల్వామా దాడికి జైషే మహ్మద్ సంస్థ బాధ్యత వహించిందా? లేదా? అనే విషయంలో తాము ఇప్పటికీ సందిగ్ధతలో ఉన్నామని అన్నారు. పుల్వామాలో దాడికి పాల్పడ్డారా? అని జైషే అధినాయకత్వాన్ని ప్రశ్నిస్తే వారు "లేదు" అని జవాబు చెప్పారని, అందుకే భారత్ కు స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోతున్నామని ఆయన వివరణ ఇచ్చారు.

More Telugu News