Andhra Pradesh: పీకే అంటే పవన్ కల్యాణ్ అని మనం అనుకుంటున్నాం.. పాక్ లో మనోడే అనుకుంటున్నారు!: జీవీఎల్ సెటైర్లు

  • యూటర్న్ లు తీసుకోవడంలో చంద్రబాబు అసాధ్యుడు
  • హీరో శివాజీ కొత్త బ్రహ్మంగారిలా తయారయ్యాడు
  • ఈ విషయంలో పవన్ కల్యాణ్ క్లారిటీ ఇవ్వాలి

యూటర్నులు తీసుకోవడంలో చంద్రబాబు చాలా అసాధ్యుడని బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ఈ విషయాన్ని నిన్నటి వైజాగ్ సభలో ప్రధాని మోదీ స్వయంగా చెప్పారని గుర్తుచేశారు. గతంలో మాట్లాడిన తప్పుడు మాటలను చంద్రబాబు పునరావృతం చేయరన్న గ్యారెంటీ ఏమీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుకు తోడుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈరోజు బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘పీకే అనగానే మనమంతా పవన్ కల్యాణ్ అనుకుంటున్నాం. కానీ పాకిస్థాన్ లో మాత్రం ఆయన మన మనిషే అని ప్రజలు అనుకుంటున్నారు. అంతర్జాతీయ కోడ్ లో పాకిస్థాన్ ను సంక్షిప్తంగా పీకే అని పిలుస్తారు. ఇటీవల చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దేశమంతా ఆయనకు చీవాట్లు పెట్టింది. ఇటీవలికాలంలో చిన్నహీరో శివాజీతో చంద్రబాబు ఇలాంటి మాటలు చాలాచాలా చెప్పించారు. దీంతో ఆయన కొత్త బ్రహ్మంగారిలా తయారయ్యాడు.

కాబట్టి ఇప్పుడు పెద్దహీరో పవన్ కల్యాణ్ తో ఆ తరహా వ్యాఖ్యలు చేయించారేమో. లేక పీకే అనే పదం ఉంది కాబట్టి పవన్ కల్యాణే సొంతంగా ప్రభావితమయ్యారేమో. ఈ విషయంలో పవన్ కల్యాణే ఓ క్లారిటీ ఇస్తే బాగుంటుంది’ అని తెలిపారు. పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలను పాక్ మీడియా ప్రముఖంగా ప్రచురించిందని గుర్తుచేశారు. చినబాబు, పెదబాబుపై గతంలో విమర్శలు గుప్పించిన పవన్, ఇప్పుడెందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.

More Telugu News