Jammu And Kashmir: పోలీసుల నుంచి తప్పించుకోబోయి లోయలోకి పల్టీలు కొట్టిన బస్సు.. ఆరుగురి దుర్మరణం!

  • జమ్మూకశ్మీర్ లోని ఉద్ధంపూర్ జిల్లాలో ఘటన
  • వేగంగా వెళుతూ అదుపు తప్పిన బస్సు
  • 38 మంది ప్రయాణికులకు గాయాలు

జమ్మూకశ్మీర్ లోని ఉద్ధంపూర్ జిల్లాలో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి సురింగ్సర్ నుంచి శ్రీనగర్ కు వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు మజాల్తా వద్ద పల్టీలు కొడుతూ లోయలోకి జారిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోగా, 39 మందికి గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న అధికారులు క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాగా, ఈ సందర్భంగా ప్రమాదంలో గాయపడ్డ ఓ ప్రయాణికుడు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో మొత్తం మృతుల సంఖ్య ఆరుకు పెరిగింది.

ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై భద్రతాబలగాలు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు డ్రైవర్ మరోదారిలో బస్సును మళ్లించాడని అన్నారు. వేగంగా వెళుతున్న బస్సు మజాల్తా ప్రాంతం వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి జారిపోయిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

More Telugu News