abhinandan vardhaman: అభినందన్‌ అదృష్టవంతుడు...కొట్టిన అల్లరి మూకలే వీడియో పోస్టుచేసి రక్షించాయి: రిటైర్డు ఎయిర్‌ కమోడోర్‌ జె.ఎల్‌.భార్గవ

  • యుద్ధ ఖైదీల విషయాన్ని శత్రుదేశాలు బయటపెట్టవు
  • 1971లో నేను పాకిస్థాన్‌ ఆర్మీకి చిక్కాను
  • నా ఆచూకీ భారత్‌కు తెలియడానికే నెల పట్టింది 

భారత్‌ వాయుసేన వింగ్‌ కమాండర్ అభినందన్‌ వర్థమాన్‌ చాలా అదృష్టవంతుడని, ఆయనను కొట్టిన అల్లరి మూకలే దాన్ని వీడియో తీసీ సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అతను సురక్షితంగా బయటపడ్డాడని ఐఏఎఫ్‌ మాజీ అధికారి, రిటైర్డు ఎయిర్‌ కమోడోర్‌ జె.ఎల్‌.భార్గవ అంటున్నారు.

అభినందన్‌ వర్థమాన్‌...ఇప్పుడు ప్రపంచానికి పరిచయం అక్కర్లేని ఇండియన్‌ ఎయిర్‌పోర్స్‌ పైలెట్‌. యుద్ధఖైదీగా పాకిస్థాన్‌కు చిక్కడమే ఈ ప్రాచుర్యానికి కారణం. సాధారణంగా శత్రుదేశానికి ఇలా చిక్కిన వారి వివరాలు వెలుగు చూడడానికే నెలలూ, సంవత్సరాలు పడుతుంది. కానీ అభినందన్‌ పాక్‌కు చిక్కిన 24 గంటల్లోనే విషయం వెలుగులోకి వచ్చింది. అల్లరి మూకలు కొట్టడం, పాకిస్థాన్‌ సైన్యం అతన్ని అదుపులోకి తీసుకుని తీసుకువెళ్లడం వంటి వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో అతని విషయం ప్రపంచానికి తెలిసింది. దాయాది దేశంపై ఒత్తిడి పెరగడంతో మూడు రోజుల్లోనే అతన్ని వదిలేసింది.

‘నిజంగా ఇదో అద్భుతం. అభినందన్‌ పాకిస్థాన్‌ భూభాగంలో చిక్కుకున్న వెంటనే ఎదురైన అనుభవాల వీడియోలే ఆయనను కాపాడాయి’ అంటున్నారు జె.ఎల్‌.భార్గవ. 1971లో ఇండో- పాక్ యుద్ధ సమయంలో దాయాది ఆర్మీకి చిక్కిన వ్యక్తి భార్గవ. దాదాపు ఏడాది తర్వాత భారత్‌ దౌత్యచర్యల మేరకు ఆయన విడుదలయ్యారు. భార్గవ పాకిస్థాన్‌కు చిక్కినట్టు భారత్‌కు సమాచారం అందడానికే నెలరోజులు పట్టింది. కానీ అభినందన్‌ విడుదల కేవలం రోజుల్లోనే జరగడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అభినందన్‌ విడుదలైన నేపథ్యంలో ఆయన విడుదల, ఆనాటి తన అనుభవాలను వెల్లడించారు.  

"పారాచ్యూట్‌ సాయంతో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో దిగిన అభినందన్‌ను కొట్టిన అక్కడి అల్లరి మూకలు ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేసి చాలా మంచి పనిచేశాయి. ఒకవేళ  ఆ వీడియోను పెట్టక పోయి ఉంటే అసలు అభినందన్‌ ఆచూకీయే తెలిసేది కాదు. ఆయన చనిపోయాడో, బతికి ఉన్నాడో వెల్లడయ్యేది కాదు. ఎందుకంటే పాకిస్థాన్‌ ఆ విషయాన్ని బయటపెట్టదు. ఒకవేళ భారత్‌ అనుమానం వ్యక్తం చేసినా తమ వద్ద లేడని అబద్ధం చెప్పేది. దీంతో అభినందన్‌ మిగతా జీవితం పాకిస్థాన్‌ జైలులోనే ముగిసిపోయేది.

1971 నాటి యుద్ధంలో అదృశ్యమైన 54 మంది సైనికుల జాబితాలోనే అభినందన్‌ కూడా చేరిపోయేవాడు. వీడియోలన్నీ సామాజిక మాధ్యమాల్లో రావడంతో తప్పని పరిస్థితుల్లో పాకిస్థాన్‌ అతని అరెస్టును ప్రకటించింది. నేను పాకిస్థాన్‌కు చిక్కినప్పుడు నా ఆచూకీ వెల్లడించడానికే పాకిస్థాన్‌ నెలరోజుల సమయం తీసుకుంది. అది కూడా భారత్‌ అనుమానాలపై అంతర్జాతీయ ఏజెన్సీలు జోక్యం చేసుకుని ఒత్తిడి పెంచడం వల్లే బయటపెట్టింది.

యుద్ధ సమయంలో తప్పని పరిస్థితుల్లో పారాచ్యూట్‌ సాయంతో దిగిన పైలట్‌కు సమస్య ఎదురయ్యేది మొదట అల్లరి మూకల నుంచే. తమ ప్రాంతంలో దిగిన వారిని వారు శత్రుదేశానికి చెందిన వారిగానే అనుమానిస్తారు. 1965 యుద్ధ సమయంలో నా సహచర పైలట్‌ ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ హుస్సేన్‌ పంజాబ్‌లో పనిచేసే వాడు. అతని యుద్ధ విమానం భారత్‌లోనే కూలిపోయింది. పారాచ్యూట్‌ సాయంతో భారత్‌ భూభాగంలోనే అతను దిగాడు.

కానీ హుస్సేన్‌ని పాకిస్థానీ అనుకుని అక్కడి అల్లరి మూకలు తీవ్రంగా కొట్టాయి. దీంతో అతను ప్రాణాపాయ స్థితికి వెళ్లిపోయాడు. కొట్టిన వారే చివరికి రక్తదానం చేసి హుస్సేన్‌ ప్రాణాలు కాపాడారు. అభినందన్‌ని కూడా అల్లరి మూకలు అలాగే కొట్టాయి. సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఉత్సాహంతో ఆ వీడియోను పోస్టు చేశారు. అదే అభినందన్‌కు వరంగా మారింది" అని భార్గవ తెలిపారు.

More Telugu News