బిన్ లాడెన్ కుమారుడి పౌరసత్వాన్ని రద్దు చేసిన సౌదీ అరేబియా

02-03-2019 Sat 07:29
  • తన తండ్రిని చంపిన అమెరికాపై పగ తీర్చుకుంటానని హంజా హెచ్చరిక
  • లాడెన్ కుమారుడి కోసం అమెరికా వేట
  • పట్టించిన వారికి భారీ నజరానా
అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకుంది. లాడెన్ కుమారుడిని పట్టించినా, ఆచూకీ చెప్పినా మిలియన్ డాలర్లను (దాదాపు రూ. 7 కోట్లు) బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రకటించిన నేపథ్యంలో సౌదీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.  

తన తండ్రిని చంపిన అమెరికా, దాని మిత్రదేశాలపై పగ తీర్చుకుంటామని హంజా బిన్ లాడెన్ గతంలో హెచ్చరికలు జారీ చేశాడు. అల్ ఖాయిదాలో హంజా లాడెన్ ప్రస్తుతం కీలక స్థానంలో ఉన్నాడు. 2017 జనవరిలో హంజాను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి ఆస్తులను బ్లాక్ చేసింది.

సౌదీ అరేబియా సర్కారుకు వ్యతిరేకంగా సౌదీ తెగల కోసం పోరాడుతున్న హంజా  పాకిస్తాన్, అప్ఘనిస్తాన్, సిరియా దేశాల్లో సంచరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అతడి ఆచూకీ చెప్పినా, కచ్చితమైన సమాచారంతో పట్టించినా ఏడు కోట్ల రూపాయలు బహుమతిగా ఇవ్వనున్నట్టు అమెరికా ప్రకటించింది.