India: మోదీ, అమిత్ షా, చంద్రబాబులను ఒక్కటే కోరుతున్నా.. కన్నీటి పర్యంతమైన కేఏ పాల్!

  • ఉగ్రవాదం కారణంగా భారత్ చనిపోతోంది
  • అతివాదులు మరోసారి అధికారంలోకి రాకూడదు
  • రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధాలు వద్దు

పుల్వామా ఉగ్రదాడి, అనంతరం భారత్-పాకిస్థాన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతప్రబోధకుడు కేఏ పాల్ భావోద్వేగానికి లోనయ్యారు. తీవ్రవాదం కారణంగా దేశం చనిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇదంతా కేవలం ఒకటి, అర శాతంగా ఉన్న అతివాద హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతరుల కారణంగానే చోటుచేసుకుంటోందని తెలిపారు. దయచేసి మనలో మనకు ఘర్షణలు వద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పాల్ కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్ నాథ్, బీజేపీ చీఫ్ అమిత్ షా, చంద్రబాబు నాయుడు, అఖిలేశ్ యాదవ్, మాయావతి సహా రాజకీయ పార్టీల నేతలందరినీ తాను ఒక్కటే కోరుతున్నానని పాల్ అన్నారు. శాంతిని పెంపొందిద్దామనీ, యుద్ధం సమస్యలన్నింటికి పరిష్కారం కాదని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలని ఆకాక్షించారు. అతివాదులు మరోసారి అధికారంలోకి రాకూడదని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ప్రధాని మోదీ తీరుతో తాను తీవ్ర అసంతృప్తికి గురయ్యాయని తెలిపారు. లౌకికవాద భారత్ ను కాపాడాలనీ, వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం యుద్ధాలను రాజేయవద్దని సూచించారు. ఈ వీడియో నేతలకు చేరేలా విస్తృతంగా షేర్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

More Telugu News