Odisha: ఒడిశాలో పోలీస్ వ్యాన్ ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు అధికారుల దుర్మరణం

  • ఒడిశాలోని జార్షుగూడా జిల్లాలో ఘటన
  • సీఎం కార్యక్రమానికి వెళుతుండగా ప్రమాదం
  • మృతుల కుటుంబాలకు సీఎం రూ.5 లక్షల పరిహారం

ఒడిశాలోని జార్షుగూడా జిల్లాలో ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సీఎం నవీన్ పట్నాయక్ బహిరంగ సభకు భద్రత కోసం వెళుతున్న పోలీస్ వ్యాన్ ను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీస్ అధికారులు అక్కడికక్కడే చనిపోగా, 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో మిగిలిన అధికారులు తమ సహచరులను హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు.

కాగా, ఈ ప్రమాదంపై నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారంతో పాటు ఓ ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. అలాగే ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పోలీసులకు రూ.లక్ష పరిహారం అందిస్తామని వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు.

More Telugu News