Amit Shah: యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే: అమిత్ షా

  • ఎన్ని భారత యుద్ధవిమానాలు పోతే అన్ని ఎక్కువ సీట్లు వస్తాయన్న యడ్డీ
  • రాజకీయ వ్యాఖ్యలు చేసుండాల్సింది కాదు
  • 'ఇండియా టుడే కాన్‌ క్లేవ్‌' లో అమిత్ షా

ఎన్ని భారత యుద్ధవిమానాలు పోతే అన్ని ఎక్కువ సీట్లు గెలుచుకుంటామంటూ కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ, పరిస్థితిని చక్కదిద్దేందుకు అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న 'ఇండియా టుడే కాన్‌ క్లేవ్‌' లో పాల్గొన్న ఆయన, యడ్యూరప్ప అలా రాజకీయ వ్యాఖ్యలు చేసుండాల్సింది కాదని అన్నారు. వైమానిక దాడులను ఏ పార్టీ వారు కూడా రాజకీయంగా వినియోగించుకోరాదని, అలా చేయడం సైన్యం త్యాగాలను అవమానపరిచినట్టేనని అన్నారు.

దేశం సంక్షోభంలో ఉన్న వేళ, విపక్షాలు బాధ్యతా రాహిత్యాన్ని ప్రదర్శిస్తున్నాయని విమర్శించిన ఆయన, ఉగ్రవాదులపై వాయుసేన దాడులు చేస్తే, ప్రతిపక్షాలు చర్చలంటూ గగ్గోలు పెట్టాయని అన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో చర్చలతో సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదని ప్రశ్నించారు. పాకిస్థాన్ మాట నిలుపుకోవడం లేదని నిప్పులు చెరిగిన ఆయన, పుల్వామాలో సైన్యం కాన్వాయ్ పై జరిగిన దాడిని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఇంతవరకూ ఖండించలేదని గుర్తు చేశారు. కాగా, భారత్ జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ బీజేపీకి లాభిస్తాయని, కర్ణాటకలో తమ పార్టీ 22 సీట్లను గెలుచుకోవడం ఖాయమని యడ్యూరప్ప వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

More Telugu News