Mahindra Group: కాస్త నిగ్రహాన్ని పాటించండి.. రిపబ్లిక్ టీవీ అధినేత అర్నాబ్ గోస్వామికి ఆనంద్ మహీంద్ర హితవు

  • ఇటువంటి సమయంలో హాని తలపెట్టే వ్యాఖ్యలు వద్దు
  • అభినందన్ ఇంకా పాక్ చెరలోనే ఉన్నాడు
  • ఇలాంటి ట్వీట్‌ల వల్ల అతడికి హాని జరిగే అవకాశం ఉంది

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పాక్ చెరలో ఉన్న భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ క్షేమంగా తిరిగి రావాలని యావత్ భారతావని ప్రార్థించింది. అతడిని విడిపింంచేందుకు భారత ప్రభుత్వం దౌత్యపరమైన మార్గాల ద్వారా పాకిస్థాన్‌పై ఒత్తిడి పెంచింది. దీంతో దాయాదికి దిగిరాక తప్పలేదు. పాక్ పార్లమెంటులో స్వయంగా ప్రధాని ఇమ్రాన్ మాట్లాడుతూ.. శుక్రవారం భారత పైలట్ అభినందన్‌ను విడిచిపెట్టనున్నట్టు ప్రకటించారు. దీంతో దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

ఇమ్రాన్ నోటి నుంచి ఆ ప్రకటన వెలువడిన వెంటనే ప్రముఖ జర్నలిస్ట్ అర్నాబ్ గోస్వామికి చెందిన రిపబ్లిక్ టీవీ తన ట్విట్టర్ ఖాతాలో .. ‘ఇది భారత్ సాధించిన గొప్ప విజయం. ఒత్తిడికి తట్టుకోలేని పాక్.. వింగ్ కమాండర్ అభినందన్‌ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. భారత్ ఈ విజయాన్ని గొప్పగా జరుపుకోవాలి’ అని ట్వీట్ చేసింది.

ఆనంద్ మహీంద్ర ఈ ట్వీట్‌ను ఉద్దేశిస్తూ.. కాస్తంత సంయమనం పాటించాలని అర్నాబ్‌కు హితవు పలికారు. మీడియా గురించి తాను చాలా అరుదుగా స్పందిస్తానన్న మహీంద్ర.. రిపబ్లిక్ టీవీ ట్వీట్‌ను తప్పుబట్టారు. అభినందన్ ఇంకా భారత్‌కు చేరుకోలేదని, తొలుత అతడిని క్షేమంగా మన దేశానికి రానీయాలని అన్నారు. ఇటువంటి రెచ్చగొట్టే ట్వీట్‌ల వల్ల పాక్ చెరలో ఉన్న మన పైలట్‌కు హాని జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కాబట్టి ‘‘అర్నాబ్.. కాస్తంత సంయమనం ప్రదర్శించు’’ అని ఆనంద్ మహీంద్ర హితవు పలికారు. ఆనంద్ మహీంద్ర ట్వీట్‌కు నెటిజన్ల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది.  

More Telugu News