Abhinandan: ముప్పేట ఒత్తిడి... అభినందన్ విడుదలకు కారణమిదే!

  • పాక్ పై ఒత్తిడి పెంచిన అమెరికా, యూఏఈ, సౌదీ
  • పెట్టుబడులు పెట్టేది లేదన్న సౌదీ
  • చేసేదేమీ లేకనే అభినందన్ విడుదల ప్రకటన

తమ అదుపులో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ను శుక్రవారం నాడు ఇండియాకు అప్పగిస్తామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిన్న స్వయంగా వెల్లడించిన తరువాత భారత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తాము శాంతి కాముకులమని, శాంతిని కోరుతున్నామని ప్రపంచదేశాలకు చెప్పేందుకే అభినందన్ ను విడిచిపెడుతున్నామని ఇమ్రాన్ వెల్లడించినప్పటికీ, అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా దేశాల నుంచి వచ్చిన ఒత్తిడితోనే ఇమ్రాన్ సర్కారు సైన్యాధికారుల అభిమతానికి వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అభినందన్ విడుదల ప్రకటన వెనుక అమెరికా కీలక పాత్రను పోషించింది. గురువారం ఉదయం హనోయ్ లో మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, ఇండియా, పాకిస్థాన్ ల నుంచి శుభవార్తను విననున్నామని స్వయంగా చెప్పారు. ఆ వెంటనే అభినందన్ విడుదలపై పాక్ ప్రకటన చేస్తుందని పలువురు అంచనా వేశారు. ఇదే సమయంలో యూఎస్ రక్షణ మంత్రి మైక్ పాంపేయ్, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తో ఫోన్ లో 25 నిమిషాల పాటు మాట్లాడారు.

భారత్ కు నమ్మకమైన స్నేహదేశంగా ఉన్న యూఏఈ సైతం పాక్ పై ఒత్తిడి పెంచింది. ఇటీవల ఆ దేశంలో పర్యటించిన సౌదీ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్, వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించారు. ఇక ఇండియా, పాకిస్థాన్ మధ్య యుద్ధం సంభవిస్తే, ఈ పెట్టుబడులను పెట్టలేమని స్పష్టం చేయడంతో పాక్ పాలకులు తలొగ్గక తప్పని పరిస్థితి నెలకొంది.

ఇక తన చైనా పర్యటనలో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన ప్రసంగంతో, పాకిస్థాన్ పై సానుకూల ధోరణితో ఉండే చైనా మనసు మార్చుకుంది. ఈ దశలో పాక్ కు సాయపడలేమని తేల్చి చెప్పింది. ఇలా అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతోనే ఇక చేసేదేమీ లేక ఇమ్రాన్ ఖాన్, అభినందన్ విడుదల ప్రకటన చేశారు.

More Telugu News