Narendra Modi: అప్పుడు నేను చెప్పిన విషయాన్నే నేడు పవన్ చెప్పారు: విజయశాంతి

  • పవన్ వాదనను సమర్థిస్తున్నా
  • దేశ భద్రతను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మానాలి
  • దేశం అల్లకల్లోలంగా ఉంటే మోదీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశమా?

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బీజేపీ గిమ్మిక్కులు చేస్తుందని తాను ఎప్పుడో చెప్పిన విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోమారు చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. పవన్ వాదనను తాను పూర్తిగా సమర్థిస్తున్నట్టు చెప్పిన విజయశాంతి.. దేశ భద్రతకు సంబంధించిన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నాలు మానుకోవాలని బీజేపీకి హితవు పలికారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో  పోస్టు చేశారు.  

సరిహద్దులో మన సైనికులు శత్రుదేశంతో ప్రాణాలకు తెగించి పోరాడుతుంటే యడ్యూరప్ప వంటి బీజేపీ నేతలు దానిని రాజకీయ స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తుండడం హేయమన్నారు. ఇటువంటి వారిని చూసి దేశ ప్రజలు ఛీకొడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన బీజేపీ జీఎస్టీ, నోట్లు రద్దు వంటి వాటితో ప్రజలను ఇబ్బందులపాల్జేసిందని ఆరోపించారు.

ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు దేశ భద్రతను బీజేపీ పణంగా పెడుతోందని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కంటే దేశ భద్రతే ముఖ్యమనుకోవడం వల్లే కేంద్రానికి మద్దతు ఇచ్చినట్టు విజయశాంతి పేర్కొన్నారు. ప్రతిపక్షాలకు ఉన్న నిబద్ధత కూడా కేంద్రానికి లేకపోవడం దారుణమన్నారు. యడ్యూరప్ప వ్యాఖ్యలకు స్పందించని మోదీ.. బీజేపీ బూత్ కార్యకర్తల సమావేశంలో మునిగి తేలడాన్ని బట్టి  వారి అజెండా ఏమిటో అర్థం చేసుకోవచ్చని విజయశాంతి పేర్కొన్నారు.

More Telugu News