Andhra Pradesh: టీడీపీకి బీసీలే వెన్నెముక.. కుల రాజకీయాలు, కుట్రలు బీసీలను పార్టీకి దూరం చేయలేవు!: మంత్రి యనమల

  • నామినేషన్ దాఖలు చేసిన యనమల, దువ్వారపు
  • సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పిన మంత్రి
  • ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, దువ్వారపు రామారావు, బీటీ నాయుడు, అశోక్‌బాబు ఈరోజు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ దాఖలుచేశారు. అనంతరం యనమల మీడియాతో మాట్లాడుతూ.. తనకు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన పార్టీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ చలువతోనే తాను ఈ స్థాయికి వచ్చానని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పేర్కొన్నారు.

జాతీయ స్థాయిలో టీడీపీ కీలకపాత్ర పోషిస్తోందని మంత్రి యనమల వ్యాఖ్యానించారు. బీసీలే టీడీపీకి వెన్నెముక అనీ, ఏ కుట్రలు, కుల రాజకీయాలు బీసీలను టీడీపీకి దూరం చేయలేవని యనమల స్పష్టం చేశారు. 2019-24 విజన్ డాక్యుమెంట్‌కి తగ్గట్లుగా టీడీపీ మేనిఫెస్టో ఉంటుందన్నారు.

కాగా, ఎమ్మెల్సీ అభ్యర్థుల వెంట ఏపీ మంత్రులు చినరాజప్ప, అచ్చెన్నాయుడు, జవహర్‌ వచ్చారు. నేటితో ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు ముగియనుంది. రేపు ఈ దరఖాస్తులను పరిశీలిస్తారు.  

More Telugu News