masood ajar: మసూద్‌ అజర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... ఫలితం దిశగా భారత్‌ దౌత్యం

  • అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలంటూ మరోమారు ప్రతిపాదన
  • గతంలో మూడుసార్లు ప్రతిపాదించగా అడ్డుకున్న చైనా
  • ఈసారి చైనా కూడా మద్దతిచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం

జైషే మహ్మద్‌ ఉగ్రవాద సంస్థ చీఫ్‌ మసూద్‌ అజర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దాయాది దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినేందుకు ప్రతిసారీ కారణమవుతున్న మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని భారత్‌ ఎప్పటి నుంచో చేస్తున్న ప్రతిపాదనకు ప్రతిసారి అడ్డుపుల్ల వేస్తూ వస్తున్న చైనా కూడా ఈసారి అతనికి వ్యతిరేకంగా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలన్న భారత్‌ ప్రతిపాదనకు ఐక్యరాజ్య సమితిలోని 15 సభ్య దేశాల్లో ఇంతవరకు మద్దతు తెలపనిది ఒక్క చైనా మాత్రమే. ఐరాసా భద్రతా మండలిలో 2009, 2016, 2017లో పీ3 దేశాలు మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ప్రతిపాదించాయి. చైనా తన వీటో అధికారంతో అప్పట్లో అడ్డుకుంది.

తాజాగా, అమెరికా బ్రిటన్, ప్రాన్స్‌తో కలిసి మరోసారి ఐక్యరాజ్య సమితిలో ఈ విషయాన్నిప్రస్తావించింది. ఈ మూడు దేశాల ప్రతిపాదనపై భద్రతామండలి పది రోజుల్లో స్పందన తెలపాల్సి ఉంది. గతంలో ఈ ప్రతిపాదనను అడ్డుకున్న చైనా ఈసారి ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, భారత్‌ దౌత్యం కారణంగా పెరుగుతున్న ఒత్తిడి మేరకు ఈసారి చైనా భారత్‌కు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

పుల్వామా దాడిని ఖండించిన చైనా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సహించకూడదని వ్యాఖ్యానించడం ఈ అభిప్రాయానికి బలం చేకూరుస్తోంది. భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌, చైనా విదేశాంగ మంత్రితో బుధవారం భేటీ అయి ఈ అంశంపైనే చర్చించినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో చైనా ఎలా వ్యవహరిస్తుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

More Telugu News