balakot: బాలాకోట్‌ ఉగ్ర స్థావరం ఎందుకయ్యింది?... ఏమిటి దీని ప్రాధాన్యత?

  • రంజిత్ సింగ్ పై యుద్ధవీరుల స్మారక కేంద్రం
  • తొలి జీహాదీలుగా వీరికి గుర్తింపు
  • మిలిటెంట్ గ్రూప్ లు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నది అందుకే

మంచీ, చెడూ...రెండింటిలో ఏ కారణం వల్లయినా ఒక ప్రాంతానికి గుర్తింపు వస్తుంది. పాకిస్థాన్‌ ఖైబర్‌-పఖ్తూంఖ్వా రాష్ట్రంలోని బాలాకోట్‌ అటువంటి గుర్తింపునే సాధించింది. ఈ ప్రాంతానికి ఎటువంటి ప్రత్యేకతలు లేకున్నా ఉగ్ర బాధిత దేశాలన్నింటికీ తెలిసిన పేరు ఇది. పుల్వామా దాడి తర్వాత భారత వైమానిక దళం సభ్యులు బాలాకోట్‌ ఉగ్రస్థావరాలపై దాడులు నిర్వహించడంతో ఒక్కసారిగా ఈ ప్రాంతం వెలుగులోకి వచ్చింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద సంస్థల్లో ఒకటైన జైషే మహ్మద్‌ మిలిటెంట్‌ సంస్థ తన ప్రధాన శిక్షణ శిబిరాన్ని ఇక్కడే నిర్వహిస్తోంది. ఒకప్పటి పోరాట వీరుల సంస్మరణ స్థానాన్ని ఉగ్రవాదులు తమ సొంత అవసరాలకు వాడుకుంటున్నారన్నది మాత్రం వాస్తవం. వివరాల్లోకి వెళితే...18వ శతాబ్దానికి చెందిన అరబ్‌ సిద్ధాంతవేత్త ముహమ్మద్‌ అబ్దుల్‌ వాహబ్‌ బోధనలు వాహబిజంగా ప్రసిద్ధి చెందాయి. అరేబియా వంటి దేశాలు ఈ ఇజాన్నే పాటిస్తున్నాయి.

వాహబ్‌ బోధనతో స్ఫూర్తి పొందిన ఇస్లాం మత బోధకుడు షావలిల్లా వద్ద శిష్యరికం చేసిన సయ్యద్‌ అహ్మద్‌ బరెల్వీ, షాఇస్మాయిల్‌లు నాటి రంజిత్‌ సింగ్‌ రాజ్యానికి వ్యతిరేకంగా మత యుద్ధాన్ని ప్రకటించారు. బరెల్వీ జన్మతహా రాయ్‌బరేలికి చెందిన వ్యక్తికాగా, షా ఇస్మాయిల్‌ బాలాకోట్‌కు చెందిన వ్యక్తి. 1831లో రాజుతో జరిపిన యుద్ధంలో వీరిద్దరూ చనిపోయారు. వీరిద్దరూ చేసిన యుద్ధాన్ని దక్షిణాదిలోనే తొలి జిహాదిగా, వారిని జిహాదీ అమర వీరులుగా ముస్లిం మిలిటెంట్‌ సంస్థలు గుర్తిస్తుంటాయి.

బరెల్వీని ఆయన అభిమానులు బాలాకోట్‌లో సమాధిచేసి తమను తాము ‘అహల్‌ ఇ అదిత్‌’గా ప్రకటించుకున్నారు. అరబ్‌ సిద్ధాంతవేత్త ముహమ్మద్‌ అబ్దుల్‌ వారసులుగా భావించిన అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం వీరిని వహబీలుగా ప్రకటించింది. 1990 దశకంలో ఏర్పాటైన ‘లష్కరే తొయిబా’ మిలిటెంట్‌ గ్రూప్‌ తమది కూడా ‘అహల్‌ ఇ అదిత్‌’ సిద్ధాంతమని ప్రకటించుకుని బాలాకోట్‌లో స్థావరాన్ని ఏర్పాటుచేసింది.

కాందహార్‌ విమాన హైజాక్‌ తర్వాత విడుదలైన హర్కతుల్‌ ముజాహిదీన్‌  ప్రధాన కార్యదర్శి మసూద్‌ అజర్‌ కూడా భారత్‌ నుంచి నేరుగా ఆఫ్ఘనిస్థాన్‌ వెళ్లి అక్కడ జైషే మహ్మద్‌ అనే కొత్త మిలిటెంట్‌ సంస్థను ఏర్పాటు చేశాడు. భారత్‌ మీద ప్రతీకార దాడులకే ఈ సంస్థను ఏర్పాటు చేసినట్లు ప్రకటించాడు. అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించాలనుకున్నాడు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకుని తొలి జిహాది వీరుల గడ్డగా భావించే బాలాకోట్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహించాలని నిర్ణయించాడు.

హర్కతుల్‌ అన్సారీ సంస్థలో మిలిటెంట్‌గా పనిచేసిన సైపుర్‌ రెహమాన్‌ సైఫీ జైషే మహ్మద్‌ సంస్థలో చేరడంతో బాలాకోట్‌ స్థావరాల బాధ్యతలను మసూద్‌ అతనికి అప్పగించాడు. 2001 నుంచి సైఫీ ఇక్కడ శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాడు. పలు ఉగ్రదాడులకు కారణమైన మిలిటెంట్లు ఇక్కడ శిక్షణ పొందిన వారే కావడం గమనార్హం. అందుకే భారత్‌ ఈ స్థావరంపై ప్రధానంగా దృష్టిసారించి దాడిచేసింది.

More Telugu News