Abhinandan: పాక్ చెరలోని అభినందన్ క్షేమంగా వచ్చేనా? జెనీవా ఒప్పందం ఏం చెబుతోంది?

  • నిన్న పాక్ సైన్యానికి పట్టుబడిన అభినందన్
  • విడిచిపెట్టాలని పాక్ కు లేఖ రాసిన భారత్
  • క్షేమంగా వస్తాడనే అంటున్న రక్షణ రంగ నిపుణులు

ప్రస్తుతం పాకిస్థాన్ చెరలో ఉన్న భారత వింగ్ కమాండర్ అభినందన్ క్షేమంగా తిరిగి రావాలంటూ, 125 కోట్ల మంది భారతీయులు ప్రార్థిస్తున్న వేళ, ఆయన్ను తిరిగి తెచ్చేందుకు భారత్ జెనీవా ఒప్పందాన్ని వాడుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అభినందన్ ను విడిచిపెట్టాలని పాక్ కు భారత విదేశాంగ శాఖ లేఖను రాసింది. యుద్ధ ఖైదీలకు సంబంధించిన నియమ నిబంధనలను జెనీవా ఒప్పందం స్పష్టంగా చెబుతున్నందున అభినందన్ తిరిగి అప్పగింత సాధ్యమేనని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. పాకిస్థానే స్వయంగా అభినందన్ వీడియోలు, ఫోటోలు విడుదల చేసింది కాబట్టి, ఇక అతని క్షేమంపై దిగులు వద్దని భరోసా ఇస్తున్నారు. అసలు జెనీవా ఒప్పందం ఏంటన్న వివరాలను పరిశీలిస్తే...

రెండో ప్రపంచ యుద్ధంలో అపారమైన ఆస్తి, ప్రాణ నష్టం తరువాత, 1949లో ఈ ఒప్పందం కుదరగా, 196 దేశాలు సంతకాలు చేశాయి. వాటిల్లో ఇండియా, పాకిస్థాన్ కూడా ఉన్నాయి. ఆపై దీన్ని మూడుసార్లు సవరించారు కూడా.

ఈ ఒప్పందంలో భాగంగా, గాయపడి శత్రు దేశానికి చిక్కిన సైనికులను జాతి, మత, లింగ, వివక్షలకు తావు లేకుండా సాయం అందించాలి. వారిని హింసించడం వంటి పనులు చేయకూడదు. సరైన న్యాయ విచారణ లేకుండా మరణశిక్ష సహా ఎటువంటి శిక్షలూ వేయరాదు. వారికి పూర్తి వైద్య చికిత్స అందించాలి. రక్షణ కల్పించాలి.

ఒకవేళ యుద్ధ నౌకలో పట్టుబడితే, వారికి వైద్య సాయం అందిస్తూ, ఆసుపత్రి ఓడలకు తరలించాలని జెనీవా ఒప్పందం స్పష్టం చేస్తోంది. ఇక పట్టుబడిన వారి పేరు, సైన్యంలో వారి ర్యాంకు, నంబర్ మినహా మరే వివరాలూ తెలుసుకునే ప్రయత్నం చేయకూడదు. సైన్యానికి సంబంధించిన రహస్యాలు చెప్పాలంటూ మానసికంగాగానీ, శారీరకంగాగానీ హింసించకూడదు. ఒకవేళ పౌరులు పట్టుబడినా ఇదే విధమైన సాయం చేయాల్సివుంటుంది.

జెనీవా నిబంధనలు స్పష్టంగా ఉండటంతో, వీటిని ప్రస్తావిస్తూ, అభినందన్ ను తిరిగి ఇండియాకు పంపాలని భారత్ అభ్యర్థిస్తోంది.

More Telugu News