Narendra Modi: ఇక మీ ఇష్టం... సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చిన నరేంద్ర మోదీ!

  • నిన్నటి పరిణామాలపై చర్చించిన నరేంద్ర మోదీ
  • హాజరైన రాజ్ నాథ్, నిర్మలా సీతారామన్
  • ఎన్ఎస్ఏ, రా చీఫ్ లు కూడా
  • యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైన్యం

పాకిస్థాన్‌ దుందుడుకు చర్యలతో సీరియస్‌ అయిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఎన్ఎస్ఏ, రా, త్రివిధ దళాధిపతులతో అత్యవసర సమావేశం తరువాత సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నానని, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గవద్దని ఆర్మీకి చెప్పేశారు. ఆ వెంటనే మోదీ అదేశాలు అందరికీ అందగా, వందల మంది జవాన్లు సెలవులు రద్దు చేసుకుంటూ దరఖాస్తులు చేసుకోగా, యుద్ధ విమానాలు పశ్చిమ ప్రాంతానికి తరలుతున్నాయి. సరిహద్దుల వెంట కాల్పులు కొనసాగుతున్న వేళ, తాము రెండు భారత్ యుద్ధ విమానాలను కూల్చేశామని, ఇద్దరు పైలట్లను బందీలుగా పట్టుకున్నామని, ఆపై ఒక్క పైలట్ మాత్రమే దొరికాడని ప్రకటించిన పాక్, ఏ క్షణాన్నయినా దాడికి సిద్ధంగా ఉన్న వేళ, మోదీ ఇచ్చిన ఆదేశాలతో సైన్యం సమరోత్సాహంతో ఉంది.

గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోగా, ఉగ్రవాద స్థావరాలపై ఇండియా దాడుల తరువాత పాకిస్థాన్‌ వైమానిక దళం మన గగనతలంలోకి చొచ్చుకువచ్చి బాంబులు జార విడిచిన సంగతి తెలిసిందే. ఆపై ఇరు దేశాల యుద్ధ విమానాలూ కూలిపోయాయి. పాకిస్థాన్‌ ప్రతి దాడులతో రెండు దేశాల మధ్యా పూర్తిస్థాయి యుద్ధం వస్తుందన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రధాని అత్యవసర సమావేశం నిర్వహించారు.

కేంద్ర మంత్రులు రాజ్‌ నాథ్‌ సింగ్‌, నిర్మలా సీతారామన్‌ సహా, ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన, సరిహద్దుల్లో పరిస్థితిని ఎన్ఎస్ఏ చీఫ్ అజిత్‌ ధోవల్‌ ను అడిగి తెలుసుకున్నారు. దాదాపు రెండుగంటల పాటు ఈ సమావేశం సాగగా, దూకుడు కొనసాగించాలని, పాకిస్థాన్ ఒత్తిళ్లకు లొంగవద్దని మోదీ చెప్పినట్టు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సరిహద్దుల్లో పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలకు దిగినా, వాటిని తిప్పి కొట్టాలని ఆదేశించారు.

ఆపై అజిత్ దోవల్ నుంచి ఆదేశాలు వెలువడగా, బెంగళూరు ఎయిర్ షోలో ఉన్న తేజస్‌, మిగ్‌, మిరాజ్‌ 2000, హాక్‌ లు సహా అన్ని విమానాలు, ఫైటర్ చాపర్లను సరిహద్దులకు తరలించే ప్రక్రియ ప్రారంభమైంది. వీటికి ఇంధనాన్ని అందించేందుకు 500 ట్రక్కులను కేటాయించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని ఇంధన డిపోల్లో చమురును నింపగా, జమ్మూ కశ్మీర్, రాజస్థాన్‌, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచారు. యుద్ధ సన్నద్ధతను పరిశీలించిన వైమానిక దళం తూర్పు కమాండ్‌ అధిపతి మనోజ్‌ నారావనే పనాగఢ్‌, ఆదేశిస్తే, పాక్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది.

More Telugu News