India: మరో పెళ్లికి సిద్ధమైన ప్రియురాలు.. కత్తితో దాడిచేసి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు!

  • ఒడిశాలోని బంధాదియా గ్రామంలో ఘటన
  • పెళ్లికి ఒప్పుకోని అమ్మాయి తల్లిదండ్రులు
  • యువతి దుర్మరణం, కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రియుడు

ప్రియురాలు మరో పెళ్లికి సిద్ధం కావడంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారిపోయాడు. యువతిపై దాడి చేసి, తాను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ యువతి ప్రాణాలు కోల్పోగా, ప్రియుడు మాత్రం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటన ఒడిశాలోని జైపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని బంధాదియా గ్రామానికి చెందిన ఓ యువకుడు(27) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ కొంతకాలం సహజీవనం చేశారు. అయితే వీరి పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. మరో వ్యక్తికి ఇచ్చి వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విషయంలో ప్రియురాలు కూడా మౌనంగా ఉండిపోవడంతో యువకుడు రెచ్చిపోయాడు. ఓ కత్తి తీసుకుని యువతి ఇంటికి వెళ్లాడు.

ఆమెపై పలుమార్లు కత్తితో దాడిచేశాడు. అనంతరం తన చేయి కోసుకుని కడుపులోకి కత్తితో పొడుచుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వీరిద్దరిని వెంటనే ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ యువతి ప్రాణాలు విడిచింది. సదరు ప్రియుడు మాత్రం కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. మరోవైపు ఈ ఘటనపై యువతి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News