India: ఫిబ్రవరి 14 తరువాత... ఎప్పుడేం జరిగిందంటే..!

  • ప్రేమికుల రోజున జవాన్లపై ఆత్మాహుతి దాడి
  • ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని కేంద్రంపై ఒత్తిడి
  • అప్పటి నుంచే పక్కా ప్రణాళిక

ఫిబ్రవరి 14... యువతీ యువకులు వాలెంటైన్స్ డే జరుపుకోవడంలో నిమగ్నమై ఉన్నారు. ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు బయలుదేరారు. చిన్నారులు స్కూళ్లకు... ఇలా ఎవరి పనుల్లో వారున్న వేళ, జమ్ము కశ్మీర్ లో సరిహద్దు ప్రాంతానికి బయలుదేరిన సీఆర్పీఎఫ్ కాన్వాయ్ పై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని గురించి తెలుసుకున్న భారతావని ఆగ్రహంతో రగిలిపోయింది. పాక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.

ఫిబ్రవరి 15... ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్‌ సమావేశం జరుగగా, పాకిస్థాన్ కు సర్ ప్రైజ్ గా దీటైన జవాబు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అంతకన్నా ముందు దాడి ఎలా ఉండాలన్న విషయం తేల్చాలని భావించారు. అదే రోజున ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ బీరేందర్‌ సింగ్‌ ధనోవా, వైమానిక దాడుల ప్రస్తావన తేగా, వెంటనే ప్రభుత్వం ఆమోదం పలికింది.

ఆపై ఫిబ్రవరి 16 నుంచి 20 మధ్య 'హెరాన్‌' డ్రోన్లు గగనతల సర్వే చేశాయి. ఎల్ఓసీకి 80 కిలోమీటర్ల దూరంలో ఉండే బాలాకోట్ చుట్టుపక్కల ప్రాంతాలను, ఉగ్రవాద శిబిరాలను నిశితంగా పరిశీలించాయి. దాదాపు 700 మంది వరకూ అక్కడ ఉన్నారని, వంటవాళ్లు, పనివాళ్లు, స్విమ్మింగ్ పూల్స్ వంటి సౌకర్యాలున్నాయని వెల్లడైంది. జైష్‌ ఎ మహమ్మద్ సంస్థ ఇతర శిబిరాల్లోని ఉగ్రవాదుల్ని బాలాకోట్ కు తరలించిందన్న సమాచారం నిఘా వర్గాలకు అందగా, ఆ వెంటనే దాడికి ప్రణాళిక సిద్ధమైంది.

ఫిబ్రవరి 20 నుంచి 22 మధ్య వైమానిక దళం, ఇంటెలిజెన్స్ వర్గాలు దాడులు చేయాల్సిన టార్గెట్లను పక్కాగా గుర్తించాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లోని 1స్క్వాడ్రన్‌ కు చెందిన 'టైగర్స్‌', 7 స్వ్కాడ్రన్‌ కు చెందిన 'బ్యాటిల్‌ యాక్సెస్‌' టీములు దాడికి వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. అందుకోసం 12 యుద్ధ విమానాలతో కూడిన రెండు మిరాజ్‌ స్క్వాడ్రన్లను ఎంపిక చేశారు.

ఫిబ్రవరి 24న మధ్య భారత్‌ ఈ విమానాలు మీదుగా ట్రయల్‌ రన్‌ వేశాయి.

ఇక అసలు పని ఫిబ్రవరి 25న ప్రారంభమైంది. సాయంత్రం నుంచి విమానాల్లో బాంబులను నింపుకున్న మిరాజ్‌ 2000 ఫైటర్ జెట్స్, బ్యాచ్‌ ల వారీగా గ్వాలియర్‌ నుంచి టేకాఫ్ తీసుకున్నాయి. ఈ విమానాలకు రూట్ క్లియరెన్స్ ఇచ్చేందుకు భటిండా నుంచి ఓ విమానం కదలగా, అవసరమైతే ఆకాశంలో ఇంధనం నింపేందుకు ఆగ్రా నుంచి మరో విమానం బయలుదేరింది. ఒక రహస్య ప్రాంతం నుంచి నిఘా డ్రోన్‌ 'హెరాన్‌' మరోసారి రంగంలోకి దిగింది. ఇలా పలు విమానాలు విభిన్న స్థావరాల నుంచి టేకాఫ్ తీసుకోవడంతో పాక్ రక్షణ వర్గాల్లో అయోమయం ఏర్పడింది.

మిరాజ్ పైలట్లు తమ టార్గెట్లకు సంబంధించిన తనిఖీలు పూర్తి చేసుకోగా, సెంట్రల్ కమాండ్ సెంటర్ నుంచి ముందుకు వెళ్లాలంటూ ఆదేశాలు వచ్చాయి. ఎల్ఓసీని దాటేవేళ, ముజఫరాబాద్‌ ప్రాంతంలో అతి తక్కువ ఎత్తులో ఇవి ఎగురుతూ వెళ్లాయి. ఈ శబ్దాలను కిందవున్న ప్రజలు చాలా స్పష్టంగా విన్నారు. విమానాల్లోని ఓ బృందం బాలాకోట్‌ వైపు సాగింది. లక్ష్యాలను చేరుకున్న తరువాత లేజర్ పాడ్ల సాయంతో వాటిని గుర్తించి, ఉగ్రవాద శిబిరం మొత్తం నిద్రావస్థలో ఉన్న వేళ, ఆరు బాంబులు వేయగా, ఆ కేంద్రం సర్వనాశనమైంది. భారత సైనికులకు చిన్న గాయం కాకుండా, మొత్తం ఆపరేషన్ 19 నిమిషాల్లో ముగిసింది.

More Telugu News