Cricket: శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్యకు షాక్.. రెండేళ్ల నిషేధం విధించిన ఐసీసీ!

  • జయసూర్యపై అవినీతి ఆరోపణలు
  • విచారణకు సహకరించని శ్రీలంక మాజీ క్రికెటర్
  • ఐసీసీ నిర్ణయంపై అప్పీల్ చేయబోనన్న జయసూర్య

శ్రీలంక మాజీ క్రికెటర్ సనత్ జయసూర్యకు ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణలు రావడంతో జయసూర్యపై అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) రెండేళ్ల నిషేధం విధించింది. ఈ నిషేధం సమయంలో క్రికెట్ కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో కూడా జయసూర్య పాల్గొనరాదని స్పష్టం చేసింది. ఐసీసీ అవినీతి నిరోధక విభాగం (ఏసీయూ) నియమావళికి విరుద్ధంగా జయసూర్య ప్రవర్తించారు.

విచారణలో సహకరించకుండా సాక్ష్యాలను ధ్వంసం చేశారు. అయితే గత చరిత్ర బాగుండటంతో ఆయనపై రెండేళ్ల నిషేధంతో సరిపెట్టినట్లు ఏసీయూ జనరల్‌ మేనేజర్‌ అలెక్స్‌ మార్షల్‌ తెలిపారు. జయసూర్య అవినీతిపై 2017లోనే విచారణ ప్రారంభమయిందన్నారు. విచారణలో భాగంగా జయసూర్య ఫోన్ సంభాషణే కీలకంగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు.

ఇందుకోసం ఫోన్లను స్వాధీనం చేయాలని కోరగా, జయసూర్య తిరస్కరించారనీ, ఫోన్లను ధ్వంసం చేశారని అన్నారు. జయసూర్యపై విధించిన రెండేళ్ల నిషేధం గతేడాది అక్టోబర్ 16 నుంచి అమలవుతుందని తెలిపారు. కాగా, ఈ నిషేధాన్ని తాను అంగీకరిస్తున్నాననీ, దీనిపై ఎలాంటి అప్పీల్ చేయబోనని జయసూర్య తెలిపారు. 1996 వన్డే ప్రపంచకప్ ను శ్రీలంక గెలుచుకోవడంలో జయసూర్య కీలకపాత్ర పోషించారు.

More Telugu News