పాక్ కుటిలనీతిని బీజింగ్ వేదికగా ఎండగట్టిన సుష్మా స్వరాజ్!

27-02-2019 Wed 10:03
  • ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా దాడులు
  • ఎంత విన్నవించినా పట్టించుకోని పాక్
  • బీజింగ్ లో సుష్మా స్వరాజ్
పాక్ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాదులు తమ దేశంలోకి చొరబడి ఉగ్రదాడులకు పాల్పడుతున్నారని, వారిని అదుపు చేయాలని, ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలని తాము ఎంతగా నివేదించినా, పాకిస్థాన్ మాత్రం ఏమీ పట్టనట్టుగానే వ్యవహరిస్తోందని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ నిప్పులు చెరిగారు. భారత్, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల సమావేశం బీజింగ్ లో ప్రారంభంకాగా, హాజరైన ఆమె, పాక్ వైఖరిని ఎండగట్టారు. పుల్వామాలో ఆత్మాహుతిదాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్ స్వయంగా వెల్లడించినా, పాక్ చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

పీఓకేలో ఇండియా చేపట్టిన లక్షిత దాడులు, ఉగ్రవాద శిబిరాలు, వారి మౌలిక వసతులను ధ్వంసం చేసే ఉద్దేశంతోనే సాగాయని స్పష్టం చేశారు. పాకిస్థాన్ సైనిక స్ధావరాలను తాము లక్ష్యంగా చేసుకోలేదని అన్నారు. జైషే మహమ్మద్ మరో దాడికి సిద్ధమవుతుందని తమ ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలోనే ఈ దాడి చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఇండియా ఎంతో బాధ్యతాయుతంగా, సం‍యమనంతో వ్యవహరిస్తోందని ఆమె చెప్పారు. అంతర్జాతీయ సమాజం సైతం పాక్ కు హితవు చెబుతూనే ఉందని, అయినా, ఉగ్రవాదులతో తమకు సంబంధం లేదని అబద్ధాలు చెబుతోందని ఆరోపించారు.