Amezon: విజయ్ దేవరకొండ బ్రాండ్ పేరిట నకిలీ దుస్తులు.. అమెజాన్ కు కోర్టు ఆదేశాలు

  • నకిలీ దుస్తుల్ని తయారు చేస్తున్న వ్యాపారస్థులు
  • జనరిక్ పేరుతో అమెజాన్ దుస్తుల అమ్మకం
  • బెంగుళూరు సివిల్ కోర్టులో దావా

గతేడాది జూలైలో టాలీవుడ్ కథానాయకుడు విజయ్ దేవరకొండ ‘రౌడీ’ అనే దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. విజయ్ చేపట్టిన ప్రచారంతో ఈ బ్రాండ్ యూత్‌లోకి వెళ్లేందుకు ఎంతో సమయం పట్టలేదు. అలాగే వ్యాపారస్థులు ఈ బ్రాండ్ పేరుతో నకిలీ దుస్తుల్ని తయారు చేసేందుకు పెద్దగా సమయం పట్టలేదు. జనరిక్ పేరుతో ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అమ్ముతున్నారు. ఈ నకిలీ దుస్తులపై విజయ్ ఫోటోను ఉంచి విక్రయిస్తున్నారు. దీంతో బెంగుళూరుకు చెందిన ‘రౌడీ’ ప్రైవేట్ లిమిటెడ్ అక్కడి సిటీ సివిల్ కోర్టులో దావా వేసింది. దీనిపై విజయ్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించింది. నకిలీ ‘రౌడీ’ బ్రాండ్‌ను అమ్మకూడదని అమెజాన్‌ను ఆదేశించింది.

ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ మార్చి 29న జరగనుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ అసిస్టెంట్ ఆకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. అమెజాన్‌లో ‘రౌడీ’ బ్రాండ్‌ను అమ్ముతున్నట్టు తమ మేనేజర్లు గుర్తించారని.. అలాగే కొందరు అభిమానులు కూడా ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఇప్పటికే హైదరాబాద్‌లో తమ బ్రాండ్‌కి సంబంధించిన నకిలీ దుస్తులు అమ్ముతున్న వ్యాపారస్థులపై చర్య తీసుకున్నామని కానీ ప్రస్తుతం ఏపీ, కర్ణాటక నుంచి సమస్య ఏర్పడిందని అన్నారు.

More Telugu News