air force: పెద్ద శబ్దంతో యుద్ధ విమానాలు దూసుకొచ్చాయి... భయంతో వణికిపోయాం: సరిహద్దులోని ప్రజలు

  • తెల్లవారుజామున నియంత్రణరేఖ మీదుగా పాకిస్థాన్ కు దూసుకుపోయిన భారత యుద్ధ విమానాలు
  • భీకర శబ్దాలకు భయంతో వణికిపోయిన బోర్డర్ ప్రజలు
  • కుటుంబసభ్యులంతా ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూనే ఉన్నారన్న ఓ వ్యక్తి

భారత్-పాకిస్థాన్ నియంత్రణ రేఖ వద్ద ఉన్న ప్రజలకు ఇరు దేశ సైనికుల మధ్య జరిగే క్రాస్ ఫైరింగ్, ఎన్ కౌంటర్ల గురించి పూర్తిగా తెలుసు. వారి జీవితంలో ఇవి ఒక భాగమైపోయాయి. భయంతోనే వారు వారి పొలాలకు వెళ్లి పనులు చేసుకుని వస్తుంటారు. క్రాస్ ఫైరింగ్ జరిగేటప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడమో, లేదా బంకర్లలో దాక్కోవడమో చేస్తుంటారు. కానీ, ఈ తెల్లవారుజామున భారత యుద్ధ విమానాలు తమపై ఎగురుతూ పాక్ లోకి దూసుకుపోవడం వారిని తీవ్ర భయాందోళనలకు గురి చేసింది.

పూంచ్, మెంధార్ సెక్టార్ లతో పాటు ఎల్వోసీ సమీపంలో నివసించే ప్రజలు ఈ హఠాత్పరిమాణంతో షాక్ కు గురయ్యారు. అహ్మద్ అనే వ్యక్తి దీని గురించి మాట్లాడుతూ, 'అందరం గాఢ నిద్రలో ఉన్నాం. పెద్ద శబ్దం చేస్తూ జెట్ విమానాలు ఆకాశంలో ఎగురుతున్నాయి. పాకిస్థాన్ కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడటం మేం చూశాం. మోర్టార్ షెల్స్ మా గ్రామంలో పడటం చూశాం. కానీ, రాత్రి వేళల్లో యుద్ధ విమానాలు దూసుకుపోవడం తొలి సారి చూశాం. తీవ్ర భయాందోళనలకు గురయ్యాం' అని చెప్పాడు.

తన కుటుంబసభ్యులందరూ ఒకరినొకరు పట్టుకుని ఏడుస్తూనే ఉన్నారని మరో వ్యక్తి తెలిపాడు. 10 నిమిషాల పాటు యుద్ధ విమానాలు తిరిగిన శబ్దం వినిపించిందని అక్కడి వాళ్లు చెప్పారు. ఇక్కడున్నవారిని ఇళ్ల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే ముందస్తు సమాచారం కూడా తమకు రాలేదని ఇక్కడి అధికారులు తెలిపారు. రాజౌరి, పూంఛ్ జిల్లాలకు చెందిన డిప్యూటీ కమిషనర్లు కూడా ఇదే చెప్పారు. శ్రీనగర్ తో పాటు కశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో కూడా యుద్ధ విమానాలు తిరిగినట్టు సమాచారం.

More Telugu News