air force: 1971 యుద్ధం తర్వాత తొలిసారి నియంత్రణరేఖను దాటి, పాక్ లోకి చొచ్చుకుపోయిన భారత యుద్ధ విమానాలు

  • 1999 కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొన్న వాయుసేన
  • అయితే నియంత్రణ రేఖ దాటకుండా... మన గగనతలం నుంచే దాడులు
  • ఎయిర్ స్ట్రైక్స్ అనంతరం జామ్ నగర్, మలియా, అహ్మదాబాద్, వడోదరల్లో ఉన్న ఎయిర్ బేసుల్లో హైఅలర్ట్

ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలను కోల్పోవడంతో యావత్ భారతదేశం ఆగ్రహంతో ఊగిపోయింది. పాకిస్థాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాలని ముక్తకంఠంతో భారతీయులంతా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, ఈ తెల్లవారుజామున 3.30 గంటలకు పాకిస్థాన్ లోని ఉగ్రతండాలపై భారత వాయుసేన విరుచుకుపడింది. పుల్వామా దారుణం జరిగిన 12 రోజుల తర్వాత 12 యుద్ధ విమానాలతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్... ఉగ్రతండాలను ధ్వంసం చేసి, విజయవంతంగా ఆపరేషన్ ను పూర్తి చేసింది.

1971 యుద్ధం తర్వాత భారత యుద్ధ విమానాలు నియంత్రణరేఖను దాటి పాకిస్థాన్ లోకి చొచ్చుకుపోవడం ఇదే ప్రథమం. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో కూడా భారత వాయుసేన పాల్గొంది. టెర్రరిస్టుల ఔట్ పోస్టులను కార్గిల్ యుద్ధం సమయంలో ఎయిర్ ఫోర్స్ ధ్వంసం చేసింది. అయితే, నియంత్రణ రేఖను దాటకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, భారత గగనతలంలో ఉంటూనే ఈ దాడులు జరిపింది.  

ఈ తెల్లవారు జామున ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన అనంతరం సరిహద్దుల్లో భారత్ తన డిఫెన్స్ మెకానిజంను మోహరింపజేసింది. అంతేకాదు, జామ్ నగర్, మలియా, అహ్మదాబాద్, వడోదరల్లో ఉన్న ఎయిర్ బేసుల్లో హైఅర్ట్ ప్రకటించింది. ఏ క్షణంలోనైనా విరుచుకుపడేలా బలగాలను సన్నద్ధం చేసింది.

More Telugu News