india: భారత యుద్ధ విమానాలను ఎదుర్కొనేందుకు సిద్ధమై, వెనక్కు తగ్గిన పాక్ ఎయిర్ ఫోర్స్

  • పాక్ ప్రధాన భూభాగంలోకి కూడా చొచ్చుకెళ్లిన భారత యుద్ధ విమానాలు
  • ప్రతిఘటించేందుకు సిద్ధమై కూడా వెనక్కి తగ్గిన పాక్ కు చెందిన ఎఫ్-16 విమానాలు
  • మన విమానాల సంఖ్య, కూర్పును చూసి వెనక్కి తగ్గిన వైనం

ఈ తెల్లవారుజామున పాక్ ఆక్రమిత కశ్మీర్ లోనే కాకుండా, పాకిస్థాన్ ప్రధాన భూభాగంలో కూడా భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. పన్నెండు మిరేజ్ జెట్ ఫైటర్లు ఈ దాడుల్లో పాల్గొన్నాయి. వెయ్యి కిలోల బాంబులతో జైషే మొహమ్మద్ ఉగ్రతండాలపై విరుచుకుపడ్డాయి. పాకిస్థాన్ ప్రధాన భూభాగంలో ఉన్న ఖైబర్ ఫక్తూంక్వాలోని మన్సెహ్రా జిల్లా బాలాకోట్ వరకు భారత విమానాలు చొచ్చుకెళ్లి దాడులు జరిపాయి. తమ ప్రధాన భూభాగంలోకి భారత యుద్ధ విమానాలు వచ్చాయన్న సంగతిని పాక్ ఆర్మీ కూడా తెలిపింది.

మరోవైపు, మిరేజ్-2000 విమానాలను ప్రతిఘటించేందుకు పాకిస్థాన్ కు చెందిన ఎఫ్-16 విమానాలు సిద్ధమయ్యాయి. కానీ, భారీ సంఖ్యలో ఉన్న మన విమానాలు (12), వ్యూహాత్మకంగా అవి ప్రయాణిస్తున్న తీరును గమనించి, వెనక్కి తగ్గాయి. మన వాయుసేన ఎంత పక్కా ప్రణాళికతో దాడులు జరిపిందన్నదానికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు.

More Telugu News