Omar Abdullah: ఆర్టికల్ 35-ఎను టచ్ చేశారో.. కశ్మీర్ పరిస్థితి అరుణాచల్ ప్రదేశ్ కంటే దారుణంగా మారుతుంది: ఒమర్ అబ్దుల్లా

  • ముందు ఎన్నికలు నిర్వహించండి
  • ఆర్టికల్ 35-ఎపై కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది
  • అరుణాచల్‌లో ఏం జరుగుతోందో గుర్తుపెట్టుకోండి

ఆర్టికల్ 35-ఎ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటే జమ్ముకశ్మీర్ పరిస్థితి అరుణాచల్ ప్రదేశ్ కంటే దారుణంగా తయారవుతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంత రాష్ట్రమైన అరుణాచల్ ‌ప్రదేశ్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కశ్మీర్‌లోనూ తలెత్తుతాయని అన్నారు.

‘‘ఆర్టికల్ 35ఎ-తో మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఏం జరిగిందో మర్చిపోవద్దు. అక్కడ శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం (పీఆర్‌సీ) విషయంలో వేలు పెట్టారు. ఇప్పుడక్కడ పరిస్థితి ఎలా ఉందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు’’ అని అబ్దుల్లా హెచ్చరించారు. ‘‘ముందైతే ఎన్నికలను నిర్వహించండి. ఏం చేయాలో కొత్త ప్రభుత్వం నిర్ణయిస్తుంది’’ అని మోదీ ప్రభుత్వానికి సూచించారు.

అరుణాచల్ ప్రదేశ్‌లో స్థానికేతరులకు కూడా పీఆర్‌సీలు జారీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం 48 గంటలపాటు బంద్ నిర్వహించారు.

More Telugu News