Telangana: పెనుబల్లిలోని సీడ్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. నలుగురి మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

  • బాయిలర్‌కు మరమ్మతు చేస్తుండగా పేలుడు
  • కుప్పకూలిన మూడు గదులు
  • శిథిలాల కింద చిక్కుకుని నలుగురి మృతి

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని నాయకులగూడెం సమీపంలోని విత్తన శుద్ధి కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.  సాయి సంజీవ్ సీడ్స్.. మొక్కజొన్న ప్యాక్టరీలోని బాయిలర్‌లో సాంకేతిక లోపం ఏర్పడగా సరిచేస్తున్న సమయంలో భారీ శబ్దంతో పేలిపోయింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని మూడు గదులు కుప్పకూలాయి. ఈ ఘటనలో నలుగురు కూలీలు శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు.

వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను వెంటనే పెనుబల్లిలోని ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ లీకేజీ కారణంగానే పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది.  సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. కాగా, చనిపోయిన వారిలో ఒకరు పెనుబల్లి మండలంలోని కొత్తకారాయి గూడేనికి చెందిన కర్రి రవి కాగా, మరొకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంతోష్ యాదవ్‌గా గుర్తించారు.

కారాయిగూడేనికే చెందిన మొగిలిపువ్వు కృష్ణ చైతన్య, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముకేశ్ యాదవ్ జాడ కనిపించకపోవడంతో మృతి చెందిన మరో ఇద్దరు వారే అయి ఉంటారని అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News