Russia: రష్యా అధ్యక్షుడు పుతిన్ జూడో విన్యాసాలు చూసి తీరాల్సిందే!

  • ప్రొఫెషనల్ తరహాలో ప్రదర్శన
  • ఇప్పటికీ తరగని ఫిట్ నెస్
  • చివరికి మహిళ చేతిలో చిత్తు

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంచి జూడో ఫైటర్ అన్న సంగతి తెలిసిందే. ఆయన తన 12వ ఏట నుంచే జూడోలో ఆరితేరిపోయారు. ఎన్నో పోటీల్లో కూడా పాల్గొన్నారు. పుతిన్ జూడో మాత్రమే కాదు సాంబో, క్యుకుషిన్ వంటి సంప్రదాయ యుద్ధ విద్యల్లో కూడా తర్ఫీదు పొందారు. యుక్త వయస్సు వచ్చేసరికి జూడో బ్లాక్ బెల్ట్ తో పాటు సాంబోలో నేషనల్ మాస్టర్ గా ఎదిగారు. 66 ఏళ్ల వయసులోనూ తరగని ఉత్సాహంతో ఉండడానికి మార్షల్ ఆర్ట్స్ కారణమని చెబుతుంటారు పుతిన్. తాజాగా ఆయన ఓ జూడో సెంటర్ కు వెళ్లి అక్కడ సాధన చేస్తున్న రష్యా జూడో చాంపియన్లతో సరదాగా పోటీపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్ లైన్ లో దర్శనమిస్తోంది.

అయితే, ఆ జూడో కేంద్రంలో ఉన్న ఫైటర్లు పుతిన్ తో పోరాడేందుకు కాస్త జంకినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. రష్యా అధ్యక్షుడ్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అనుకుని ఆయన ఎటు పడేస్తే అటు పడిపోయారు! పుతిన్ పెద్దగా శ్రమపడకుండానే వాళ్లకై వాళ్లే పడిపోవడం కొన్ని సందర్భాల్లో చూడొచ్చు. కానీ, ఒలింపిక్ మెడలిస్ట్ అయిన నటాలియా కుజ్యుటినా అనే మహిళా జూడోకా మాత్రం పుతిన్ ను సునాయాసంగా, ఎంతో యుక్తిగా మ్యాట్ పై పడేసి చుట్టూ ఉన్న పురుషులు సిగ్గుపడేలా చేసింది. ఆమె చేతిలో ఓటమిని పుతిన్ ఎంతో స్పోర్టివ్ గా తీసుకున్నారు. ప్రాక్టీస్ అనంతరం అందరితో ఫొటోలు దిగి వాళ్లలో ఉత్సాహం నింపారు.

More Telugu News