Congress: కాంగ్రెస్ పార్టీ తప్పుగా మాట్లాడితే మేము ప్రేక్షక పాత్ర వహించం: సీఎం కేసీఆర్

  • కాంగ్రెస్ నేతలు అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు
  • రాష్ట్రానికి రాబడి రాలేదని కాంగ్రెస్ అనడం కరెక్టు కాదు
  • దబాయించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై అసెంబ్లీలో చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్ నేతలు అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర రాబడులకు సంబంధించి తాము చెప్పిన లెక్కలను కాంగ్రెస్ పార్టీ తప్పబట్టడం తగదని అన్నారు. రాష్ట్రానికి రాబడి వచ్చిందని తాము చెబుతుంటే, రాలేదని కాంగ్రెస్ పార్టీ అనడంలో అర్థంపర్థంలేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తప్పుగా మాట్లాడితే, తాము ప్రేక్షకపాత్ర వహించమని, దబాయించి మాట్లాడాల్సిన అవసరం తమకు లేదని అన్నారు.

ప్రభుత్వానికి వచ్చే రెవెన్యూ మీద ప్రతిపక్షం ఎటువంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని, ఏదో అన్యాయం జరుగుతుందని కలవరపడాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్కకు కేసీఆర్ సూచించారు. ఈరోజు జరిగిన చర్చలో ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మకమైన సూచనలు, సలహాలు రాలేదని, అసంబద్ధమైన వాదనలు తీసుకొచ్చారని విమర్శించారు.

సభను తప్పుదోవ పట్టించే విషయాలు చెప్పే ప్రయత్నం చేశారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు చూసే బడ్జెట్ రూపొందించామని, ఈ బడ్జెట్ లో ఏముందో అదే చెప్పామని అన్నారు. ఓటాన్ అకౌంట్ కు నిర్వచనం లేదని, పరిమిత సమయానికి ఖర్చులు చూసుకోవడమే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అని, కేంద్రం కూడా అదే చేస్తుందన్న కేసీఆర్, ప్రాధాన్యతల క్రమం మారితే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని అన్నారు.

More Telugu News