sairaa: 'సైరా' షూటింగ్ ను అడ్డుకున్న ముస్లింలు.. ఉద్రిక్తత

  • బీదర్ కోటలో 'సైరా' షూటింగ్
  • హిందూ విగ్రహాలను ఉంచారంటూ ముస్లిం యువకుల ఆందోళన
  • కోట చుట్టు పక్కల ఉద్రిక్త వాతావరణం

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా భారీ ఎత్తున తెరకెక్కుతున్న 'సైరా' చిత్రానికి ఊహించని షాక్ తగిలింది. కర్ణాటకలోని బీదర్ లో ఈ సినిమా షూటింగ్ ను స్థానిక ముస్లిం యువకులు అడ్డుకున్నారు. వివాదం వివరాల్లోకి వెళ్తే, అక్కడి బహమనీ కోటలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. అయితే, కోటలోని ముస్లిం ప్రార్థనా స్థలంలో షూటింగ్ జరుగుతోందని, ఆ ప్రాంతంలో హిందువులకు చెందిన విగ్రహాలను పెట్టారని ఆరోపిస్తూ గుంపుగా వచ్చిన ముస్లిం యువకులు అడ్డుకున్నారు. హిందూ విగ్రహాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ చిత్ర దర్శకుడితో పాటు, ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ పై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు.

'సైరా' చిత్రం చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, బీదర్ కోటలో ఓ పత్యేక సెట్ వేశారు. ఈ సెట్ లో హిందూ విగ్రహాలను ఉంచారు. షూటింగ్ కు పురాతత్వ శాఖ అనుమతి తీసుకున్నా... ముస్లిం యువకులు అడ్డుకున్నారు. పోలీసులు వచ్చి హిందూ విగ్రహాలను, సెట్ ను తొలగించినట్టు సమాచారం. ఈ ఘటనతో కోట చుట్టుపక్కల ఉద్రిక్తత నెలకొంది. ముందు జగ్రత్త చర్యగా కోట పరిసర ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. 

More Telugu News