MeToo India: పరువు నష్టం కేసులో జర్నలిస్ట్ ప్రియారమణికి బెయిలు మంజూరు

  • ‘మీటూ’ ఆరోపణలపై దావా వేసిన కేంద్ర మాజీ మంత్రి ఆక్బర్‌
  • తనను లైంగికంగా వేధించారన్న ప్రియారమణి
  • తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి పదవికి రాజీనామా చేసిన అక్బర్‌

మీటూ ఉద్యమం పుణ్యాన లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొని కేంద్ర మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చిన సీనియర్‌ పాత్రికేయుడు ఎం.జె.అక్బర్‌ వేసిన పరువు నష్టం దావా కేసులో పాత్రికేయురాలు ప్రియారమణికి కోర్టు బెయిలు మంజూరు చేసింది. అక్బర్‌ తమను లైంగికంగా వేధించారని ఆయన మాజీ సహచర ఉద్యోగులు ప్రియారమణి, ప్రేరణాసింగ్‌ బింద్రా, మరో మహిళా జర్నలిస్టు గత ఏడాది అక్టోబరు 20న ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఈ వివాదం చిలిచిలికి గాలివానలా మారడంతో చివరికి అక్బర్‌ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయక తప్పలేదు. అనంతరం  ప్రియారమణి ఆరోపణలు అవాస్తవమని, తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆమెపై పరువునష్టం దావా వేశారు. సోమవారం ఈ కేసు పటియాలా హౌస్‌కోర్టులో విచారణకు వచ్చింది.

కేసు పరిశీలించిన న్యాయమూర్తి ప్రియారమణికి బెయిలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను ఏప్రిల్‌ 10వ తేదీకి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ప్రియారమణి ఓ న్యూస్‌ ఏజెన్సీతో మాట్లాడుతూ ఇప్పుడు అవకాశం తన చేతికి వచ్చిందన్నారు. నిజమే తన ఆయుధమని, తన కథను ప్రపంచానికి తెలియజేస్తానని తెలిపారు.

More Telugu News