Madhya Pradesh: లంచగొండి ఎమ్మార్వోకు చుక్కలు చూపించిన రైతు.. బర్రెను కారుకు కట్టేసి నిరసన!

  • మధ్యప్రదేశ్ లోని ఖర్గాపూర్ లో ఘటన
  • రూ.లక్ష లంచం కోరిన ఎమ్మార్వో
  • విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్

లంచం రుచి మరిగిన ఎమ్మార్వోకు ఓ రైతు చుక్కలు చూపించాడు. గాంధేయ మార్గంలో తన నిరసనను తెలియజేసి శభాష్ అనిపించాడు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సదరు ప్రభుత్వ అధికారిపై విచారణకు ఆదేశించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఖర్గాపూర్ పట్టణం సమీపంలో చోటుచేసుకుంది.

ఖర్గాపూర్ కు సమీపంలోని దేవ్ పూర్ గ్రామానికి చెందిన లక్ష్మీ యాదవ్‌(50) అనే రైతు తన కోడళ్ల పేరుపై కొంత పొలాన్ని కొనుగోలు చేశాడు. అనంతరం వీటి మ్యూటేషన్ (యాజమాన్య హక్కుల బదలాయింపు) కోసం ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాడు. అయితే లంచంగా రూ.లక్ష ఇస్తే మ్యూటేషన్ చేస్తానని ఎమ్మార్వో స్పష్టం చేశాడు.  దీంతో తాను రూ.50 వేలు మాత్రమే చెల్లించుకోగలనని బాధితుడు చెప్పాడు. అయితే ఇందుకు సదరు అధికారి ఒప్పుకోలేదు.

ఈ విషయంలో మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో లక్ష్మీయాదవ్ గాంధేయ మార్గంలో నిరసనకు దిగాడు. ఇంటికెళ్లి తన గేదెను తీసుకొచ్చి ఎమ్మార్వో కారుకు కట్టేశాడు. దీంతో అటుగా వెళుతున్న ప్రజలు దీన్ని ఫొటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చివరికి ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో ఆయన ఎమ్మార్వోపై విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో ఎమ్మార్వో లంచం డిమాండ్ చేశాడని ప్రాథమికంగా తేలినట్లు సమాచారం.

More Telugu News