visakhapatnam: విశాఖలో పొలిటికల్‌ హీట్‌...ఎమ్మెల్యేలతో మంత్రి గంటా శ్రీనివాసరావు భేటీ

  • వెలగపూడి కూడా హాజరు కావడం చర్చనీయాంశం
  • దాదాపు రెండు గంటలపాటు పలు అంశాలపై తర్జనభర్జన
  • రెండు మూడు రోజుల్లో చంద్రబాబును కలవాలని నిర్ణయం

విశాఖ నగరంలో రాజకీయ హీట్‌ మొదలయింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఇంట్లో సమావేశం జరగడం, ఈ సమావేశానికి ఎప్పుడూ ఉప్పునిప్పులా ఉండే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా హాజరు కావడం మరీ చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్న అనంతరం జిల్లాలో రాజకీయ అలజడి మొదలయ్యింది.

ముఖ్యంగా భీమిలి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు అక్కడ ఎదురే లేదనుకున్న సమయంలో అవంతి రూపంలో ప్రత్యర్థి ప్రత్యక్షం కావడంతో జాగ్రత్త పడడం మొదలుపెట్టారనుకుంటున్నారు. ఎంతలా ఖండిస్తున్నా ఆయన పార్టీ మారుతున్నారన్న వార్తలు వస్తూనే ఉండడం, భీమిలిలో బలమైన ప్రత్యర్ధిని ఈసారి ఎదుర్కోక తప్పదని తేలడం ఆయనను రాజకీయంగా చికాకు పరుస్తోంది. ఈ సమయంలో భేషజాలకు పోతే మొదటికే మోసం వస్తుందని భావించారో ఏమో ఆయన తన రాజకీయ వ్యూహం మార్చి నడుస్తున్నారని భావిస్తున్నారు.

అందులో భాగమే ఈ సమావేశం అన్న మాట వినిపిస్తోంది. ఒకే పార్టీలో ఉన్నా మొదటి నుంచీ ఎడమొహం, పెడమొహంగానే ఉండే వెలగపూడి కూడా గంటా ఇంట్లో జరిగే సమావేశానికి వెళ్లారంటే పైనుంచి ఆదేశాలు కూడా ఉండి ఉండవచ్చునని భావిస్తున్నారు. ఈ సమావేశానికి వెలగపూడితోపాటు పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, దక్షిణం ఎమ్మెల్యే, నగర టీడీపీ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్‌, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌తో పాటు గంటా అనుచరునిగా పేరొంది, ప్రస్తుతం నగరంలోని ఉత్తరం టికెట్టు కోసం ఆశపడుతున్నారని వార్తలు వస్తున్న యలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు హాజరయ్యారు.

దాదాపు రెండు గంటలపాటు వీరి మధ్య పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. మంత్రి గంటా తాజాపరిణామాలు, భవిష్యత్తు వ్యూహాలను వీరికి వివరించినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కలవాలని వీరంతా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

More Telugu News