Telangana: తెలంగాణలో ఇద్దరు మహిళలకు కచ్చితంగా మంత్రి పదవులు ఇస్తాం!: సీఎం కేసీఆర్

  • మహిళలపై మాకు చాలా గౌరవం ఉంది
  • వాళ్లు ఓట్లేయడం వల్లే ఈరోజు అధికారంలో ఉన్నాం
  • ఓటాన్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా సీఎం వ్యాఖ్యలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలకు శుభవార్త తెలిపారు. త్వరలోనే మరోసారి కేబినెట్ విస్తరణ చేపడతామనీ, ఈసారి ఇద్దరు మహిళలకు మంత్రి బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. ఈరోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై చర్చ సందర్భంగా కేసీఆర్ ఈ మేరకు స్పందించారు. అసెంబ్లీ సమావేశాలల్లో భాగంగా కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేని విషయాన్ని గుర్తుచేశారు.

దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ.. తమకు మహిళలపై అమితమైన గౌరవం ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది మహిళలే తమకు ఓట్లు వేశారనీ, అందువల్లే తాము ఇక్కడ కూర్చున్నామని సీఎం వ్యాఖ్యానించారు. దీంతో పలువురు సభ్యులు ఒక్కసారిగా క్లాప్స్ కొడుతూ హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.  

మంత్రివర్గంలో గరిష్టంగా 17 మందిని మాత్రమే తీసుకునే వీలుందనీ, వీరిలో ఇద్దరు మహిళలను కచ్చితంగా తీసుకుంటామని కేసీఆర్ పునరుద్ఘాటించారు. మహిళా సంఘాలకు అందించే వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.10 లక్షలకు పెంచుతున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థలకు నిర్ణీత గడువులోగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News