ఏంటి? నా ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేశావ్?: కేటీఆర్‌ ను ప్రశ్నించిన ఉత్తమ్

23-02-2019 Sat 12:24
  • సీఎల్పీ కార్యాలయంలో కలుసుకున్న సందర్భంగా ఉత్తమ్‌ ప్రస్తావన
  • మెసేజ్‌లు చూడడం తప్ప తానేమీ చేయనన్న కేటీఆర్‌
  • చర్చల సందర్భంగా నవ్వులు పూయించిన మాటలు

తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయ్యేందుకు కాంగ్రెస్‌ నాయకులను కలిసేందుకు కేటీఆర్‌ వెళ్లిన సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కను ఆయన కార్యాలయంలో కలిసి కేటీఆర్ చర్చలు జరిపిన తరుణంలో అక్కడికి పీసీపీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ కూడా వచ్చారు.

కేటీఆర్‌ ఎదురు పడగానే ‘ఏంటి... నా ఫోన్‌  నంబర్‌ బ్లాక్‌ చేశావు?’ అంటూ ఉత్తమకుమార్‌ ప్రశ్నించడంతో తొలుత ఆశ్చర్యపోయిన కేటీఆర్‌, ‘అయ్యో అదేం మాట... మీ నంబర్‌ని నేను బ్లాక్‌ చేయగలనా?’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఇద్దరు నాయకులు నవ్వుకున్నారు. ఈ సందర్బంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, తాను ఫోన్‌లో ఎక్కువగా మెసేజ్‌లే చూస్తుంటానని, అంతకు మించి ఏమీ చేయనని తెలపడంతో ఉత్తమ్ తో పాటు భట్టి కూడా నవ్వేశారు.