pune: పూణెలో కశ్మీరీ జర్నలిస్టుపై దాడి!

  • పూణెలో ఓ వార్తాపత్రికలో పని చేస్తున్న నజీర్
  • ట్రాఫిక్ వద్ద నజీర్ పై దాడి
  • కశ్మీర్ కు వెళ్లి పని చేసుకోవాలంటూ చితకబాదిన వైనం

పుల్వామా ఉగ్రదాడి అనంతరం దేశంలోని వివిధ ప్రాంతాల్లో కశ్మీరీలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. జమ్మూకశ్మీర్ కు చెందిన 24 ఏళ్ల జర్నలిస్ట్ జిబ్రాన్ నజీర్ ను ఇద్దరు వ్యక్తులు చితకబాదారు. స్థానికంగా ఉన్న ఓ వార్తాపత్రికలో నజీర్ పని చేస్తున్నాడు.

ఈ దాడి గురువారం రాత్రి చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. తన నివాసానికి బైక్ పై వెళుతున్న సందర్భంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ దాడి జరిగింది. అయితే, రోడ్డుపై జరిగిన సాధారణ గొడవగానే తొలుత పోలీసులు భావించారు. దాడికి పాల్పడినట్టు అజారుద్దీన్ షేక్, దత్తాత్రేయ లవాతేలపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ, తనను కశ్మీర్ తిరిగి వెళ్లిపోవాలని దాడి చేసిన వ్యక్తులు చెప్పారని తెలిపాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తాను ఆగినప్పుడు తన వెనక ఉన్న వీరిద్దరూ హారన్ కొడుతూ, ముందుకు వెళ్లాలని దబాయించారని చెప్పాడు. తన బైక్ హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ పై ఉండటంతో ఆ రాష్ట్రానికి వెళ్లిపోవాలని అన్నారని... తాను జమ్ముకశ్మీర్ కు చెందినవాడినని చెప్పానని... దీంతో, కశ్మీర్ కు పోయి అక్కడ పనిచేసుకోవాలని తనపై దాడి చేశారని తెలిపాడు. తన ఫోన్ ను లాక్కుని, బైక్ ను ధ్వంసం చేశారని చెప్పాడు.  అయితే, ఇది ముందుగా ప్లాన్ చేసుకుని చేసిన దాడి కాదని తెలిపాడు. అనంతరం పోలీస్ స్టేషన్ లో నజీర్ కు ఇద్దరు వ్యక్తులు క్షమాపణలు చెప్పారు. ఆ తర్వాత, కేసును నజీర్ వాపసు తీసుకున్నాడు.

More Telugu News