Andhra Pradesh: ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాకే మోదీ రాష్ట్రంలో అడుగుపెట్టాలి!: సీఎం చంద్రబాబు

  • వైసీపీకి ఒక్క ఓటు వేసినా మోదీ, కేసీఆర్ కు వేసినట్లే
  • టీడీపీ నేతలు ప్రజల్లోనే ఉండాలి
  • రాష్ట్రం కోసం చిరకాల ప్రత్యర్థులు కూడా టీడీపీలో చేరుతున్నారు

రాబోయే 6 నెలల పాటు వరుస ఎన్నికలు ఉంటాయనీ, టీడీపీ నేతలంతా ప్రజల్లోనే ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాయలసీమకు సాగునీటిని తీసుకురావడంతో టీడీపీపై సానుకూలత పెరిగిందని అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేకహోదాపై రాహుల్ స్పష్టత ఇచ్చారనీ, రేపు మోదీ వచ్చి అబద్ధాలు చెబుతామంటే కుదరదని వ్యాఖ్యానించారు. ఏపీకి వచ్చి టీడీపీని విమర్శిస్తామంటే కుదరదనీ, రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాకే మోదీ ఇక్కడ కాలు పెట్టాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాకే తెలుగువాడి ఉనికి ప్రపంచానికి తెలిసిందని చంద్రబాబు అన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలవడం చారిత్రక అవసరమని వ్యాఖ్యానించారు. వైసీపీకి ఒక్క ఓటు వేసినా టీఆర్ఎస్, బీజేపీకి వేసినట్లేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మూడు పార్టీలు కలసికట్టుగా మాట్లాడుతున్న అంశాలే ఇందుకు సాక్ష్యమన్నారు.

ఏపీ భవిష్యత్ కోసం చిరకాల ప్రత్యర్థులు సైతం విభేదాలను పక్కన పెట్టి టీడీపీలో చేరుతున్నారని చంద్రబాబు తెలిపారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి-రామసుబ్బారెడ్డి, కోట్ల-కేఈ కుటుంబాలే ఇందుకు ఉదాహరణ అని అన్నారు. ఈ నెల 28న ఢిల్లీలో బీజేపీయేతర పార్టీల సమావేశం జరుగుతుందనీ, అందులో భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని సీఎం పేర్కొన్నారు.

More Telugu News