kisan samman: 'కిసాన్‌ సమ్మాన్‌' సాయం పొందాలంటే ఆధార్‌ తప్పనిసరి.. అంతవరకూ ప్రత్యామ్నాయం ఇదిగో!

  • రైతుకు రూ.6వేల సాయంపై మార్గదర్శకాలు జారీ
  • ఆధార్‌ లేనివారు తక్షణం దరఖాస్తు చేయాలని సూచన
  • ఆధార్‌ వచ్చే వరకు ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డు అందించాలి

అన్నదాతకు సాయంపై కేంద్రం మార్గదర్శకాలు జారీచేసింది. ముఖ్యంగా ఆధార్‌ కార్డును తప్పనిసరి చేసింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి కింద ఏటా రూ.6 వేలు రైతులకు అందించనున్నట్లు ఇటీవల బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సాయం పొందాలంటే ఆధార్‌ కార్డు ఉండాలని లింక్‌ పెట్టింది. ఆధార్‌ కార్డు లేని రైతులు తక్షణం దరఖాస్తు చేయాలని సూచించింది.

అయితే, అంతవరకు ప్రత్యామ్నాయంగా ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఐడీ స్లిప్‌ లేదా ఓటర్‌ ఐడీ, పాన్‌ కార్డు, పాస్‌పోర్టు,  డ్రైవింగ్‌ లైసెన్సు, రేషన్‌ కార్డు, ఫొటో ఉన్న బ్యాంకు, పోస్టాఫీసు పాసు పుస్తకం, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ జాబ్‌ కార్డు, కిసాన్‌ ఫొటో పాసు పుస్తకం, గెజిటెడ్‌ అధికారి, తహసీల్దార్‌ అధికారిక పత్రంపై జారీ చేసిన ఫొటో ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి  సమర్పించాలని  కేంద్ర వ్యవసాయ శాఖ సూచించింది. ఆధార్‌ కార్డు ఉన్నప్పటికీ వేలిముద్రలు సరిగా పడక గుర్తింపు విఫలమైతే ఐరిస్‌, ముఖ ధ్రువీకరణ (ఫేస్‌ ఐడెంటిఫికేషన్‌) ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టం చేసింది.

వీటి ద్వారా కూడా గుర్తింపు సాధ్యం కాకుంటే లబ్ధిదారుని రిజిస్టర్డ్ ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ పంపడం ద్వారానో, ఆధార్‌ కార్డుపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారానో వివరాలను ధ్రువీకరించుకోవాలని సూచించింది. ఇందుకోసం క్యూఆర్‌ కోడ్‌ రీడర్లు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

More Telugu News