Vijayawada: అలాంటి యాడ్స్ లో నటించొద్దు... రంభ, రాశిలకు న్యాయమూర్తి హెచ్చరిక

  • వెయిట్ లాస్ ట్రీట్ మెంట్ 'సైడ్ అఫెక్ట్స్'
  • ప్రకటనల పట్ల సినీ తారలు అప్రమత్తంగా ఉండాలి
  • వినియోగదారుల ఫోరం స్పష్టీకరణ

ఊబకాయం తగ్గిస్తామని, మీరు కూడా సినీ తారల్లా సన్నజాజి తీగల్లా నాజూగ్గా మారిపోవచ్చని కొన్ని సంస్థలు ప్రకటనలతో ఊరిస్తుంటాయి. అధిక బరువుతో బాధపడేవాళ్లకు ఇలాంటి ప్రకటనలు కొత్త ఆశలు కలిగిస్తుంటాయి. పైగా ఈ ప్రకటనల్లో కొందరు సినీ తారలు నటిస్తుండడంతో స్థూలకాయులు ఈజీగా ఆకర్షితులవుతుంటారు. ఇలాంటి ప్రకటన చూసి మోసపోయానంటూ ఓ వ్యక్తి విజయవాడలో వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించడంతో వెయిట్ లాస్ సైడ్ అఫెక్ట్స్ వెలుగులోకి వచ్చాయి. కలర్స్ అనే వెయిట్ లాస్ సంస్థ టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు రాశి, రంభలతో ప్రత్యేకంగా యాడ్ రూపొందించి స్వల్పకాలంలో బరువు తగ్గిస్తామంటూ ప్రచారం చేస్తోంది. ఆ సంస్థ ప్రకటన చూసి తాను ట్రీట్ మెంట్ తీసుకుని మోసపోయానని బాధితుడు వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి మాధవరావు కలర్స్ సంస్థకు జరిమానా విధించారు. బాధితుడు ట్రీట్ మెంట్ కోసం చెల్లించిన రూ.74,652 మొత్తానికి 9 శాతం వడ్డీ కలిపి వెంటనే చెల్లించాలంటూ ఆదేశించారు. అంతేకాదు, రాశి, రంభలతో రూపొందించిన యాడ్స్ ను తక్షణమే నిలిపివేయాలంటూ తీర్పులో పేర్కొన్నారు. ఈ క్రమంలో రాశి, రంభలకే కాకుండా ఇలాంటి ప్రకటనల్లో నటిస్తున్న కొందరు సినీ తారలకు వర్తించేలా ఆయన హితవు పలికారు. సెలబ్రిటీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల్లో నటించడం మానుకోవాలని సూచించారు. ఇకపై అలాంటి యాడ్స్ లో నటిస్తే సెలబ్రిటీలు అని కూడా చూడకుండా ఫైన్ విధిస్తామని హెచ్చరించారు మాధవరావు.

More Telugu News