China: కాక్ పిట్ లో నిద్రపోయిన పైలెట్.. చోద్యం చూసిన కో-పైలెట్.. ఇద్దరికీ ఉద్వాసన!

  • టేకాఫ్ తర్వాత గుర్రుపెట్టిన పైలెట్
  • వీడియో తీసిన కో-పైలెట్
  • ఇద్దర్నీ పీకిపడేసిన చైనా ఎయిర్ లైన్స్

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒక్కోసారి విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి. వాతావరణం అనుకూలించకపోవడమో, లేక, సాంకేతిక లోపమో విమాన దుర్ఘటనలకు కారణమవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మానవ తప్పిదం ఉందని తెలిస్తే అది దిద్దుకోలేని దారుణం అవుతుంది. కానీ ఈ చైనా పైలెట్ అదేమీ పట్టించుకోకుండా విమానం గాల్లోకి లేవగానే హాయిగా తన సీట్లోనే నిద్రపోయాడు. ఆ పక్కనే ఉన్న కో-పైలెట్ ఓ పక్క కంట్రోల్స్ ఆపరేట్ చేస్తూనే మరోవైపు పైలెట్ నిద్రపోవడాన్ని ఎంచక్కా వీడియోలో బంధించాడు.

చైనా ఎయిర్ లైన్స్ కు చెందిన బోయింగ్-747 విమానంలో జరిగిందీ ఘటన. సదరు పైలెట్ కు 20 ఏళ్ల అనుభవం ఉంది. ఇక, అతడి నిద్రాపర్వం తాలూకు వీడియో ఆన్ లైన్ లో దర్శనమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. దాంతో చైనా ఎయిర్ లైన్స్ ఆగమేఘాల మీద క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించింది. నిద్రపోయిన పైలెట్ పై ముందు వేటు వేసిన ఉన్నతాధికారులు ఆ తర్వాత ఏమాత్రం కనికరం లేకుండా కో-పైలెట్ ను కూడా క్రమశిక్షణ చర్యల కింద విధుల నుంచి తొలగించారు. పైలెట్ నిద్రపోతున్నప్పుడు అతడిని నిద్ర లేపాల్సింది పోయి సరదాగా వీడియోలో రికార్డ్ చేస్తావా? అంటూ అధికారులు ఆ కో-పైలెట్ కు చీవాట్లు పెట్టారు.

More Telugu News