Andhra Pradesh: ఏపీకి ఇచ్చిన మాట తప్పిన మోదీ సిగ్గుపడాలి: రాహుల్ గాంధీ

  • మోదీ హామీలు, ప్రకటనలన్నీ అబద్ధం
  • మోదీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా అమలైందా?
  • ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ ‘కాంగ్రెస్’ నిద్రపోదు

ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని, ఏటా రెండు కోట్ల మందికి ఉపాధి కల్పిస్తామని, రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని నాటి ఎన్నికలకు ముందు మోదీ హామీ ఇచ్చారని, అందులో ఏ ఒక్క హామీ అయినా అమలైందా? అని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు.

 తిరుపతిలో ‘భరోసా యాత్ర’ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ, మోదీ ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలన్నీ అబద్ధమని అన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తానని చెప్పి మాట తప్పిన మోదీ సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే వరకూ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరోసారి స్పష్టం చేశారు. అవినీతి అంతానికి ప్రధానిగా కాకుండా కాపలాదారులా కృషి చేస్తానన్న మోదీ, రాఫెల్ కుంభకోణంలో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్లు దోచిపెట్టారని ఆరోపించారు.

 దేశానికి అన్నం పెట్టే రైతన్నకు రుణమాఫీ చేసేందుకు మోదీకి మనసు రావట్లేదని, బడా వ్యాపారవేత్తలకు మాత్రం రూ.3.5 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని ఎద్దేవా చేశారు. ఈరోజున చాలా మంది తామే గొప్ప దేశభక్తులమని చెప్పుకుంటున్నారని, జవాన్లపై దాడి సమయంలో మోదీ తన ప్రచార చిత్రానికి పోజులు ఇచ్చారని విమర్శించారు.

More Telugu News