kodi ramakrishna: కోడి రామకృష్ణ నుదిటిపై బ్యాండ్ ఎందుకు ధరిస్తారో తెలుసా?

  • ఎన్టీఆర్ కాస్ట్యూమర్ మోకా రామారావు వల్ల బ్యాండ్ పెట్టుకోవడం అలవాటైంది
  • జ్యోతిష్కులైన స్నేహితుల వల్ల ఉంగరాలు పెట్టుకోవడం అలవాటైంది
  • పోలీసులకు టోపీ, రైతుల తలపాగాలా.. నాకు బ్యాండ్ చాలా పవిత్రమైనది

ఊపిరితిత్తుల వ్యాధితో ప్రముఖ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయనను చూడగానే నవ్వుతో కూడిన ముఖం, నుదిటిపై బ్యాండ్ కనిపిస్తాయి. అంతేకాదు, చేతులకు తాళ్లు, వేళ్లకు ఉంగరాలు కూడా ఉంటాయి. ఆయనకు సెంటిమెంట్లు ఎక్కువ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ వీటికి సంబంధించి వివరణ ఇచ్చారు.

కేవలం బీచ్ దగ్గర తన రెండో సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు... మిట్ట మధ్యాహ్నం సమయంలో ఎన్టీఆర్ గారి కాస్ట్యూమర్ మోకా రామారావుగారు తన వద్దకు వచ్చారని... విశాలంగా ఉన్న మీ నుదురు ఎండకు ఎక్స్ పోజర్ అవుతోందని చెప్పి, జేబు రుమాలు ఇచ్చి కట్టుకోమని చెప్పారని తెలిపారు. మరుసటి రోజు బ్యాండ్ లా తయారు చేసి తీసుకొచ్చారని చెప్పారు. ఇది అందరికీ మ్యాచ్ అవదని, మీకు బాగా సూట్ అయిందని, దీన్ని కట్టుకోకుండా ఎప్పుడూ ఉండవద్దని తనకు చెప్పారని గుర్తుచేసుకున్నారు. అప్పటి నుంచి షూటింగ్ లో బ్యాండ్ కట్టుకోవడం తన సెంటిమెంట్ అయిందని చెప్పారు. పోలీసులకు టోపీ, రైతులకు తలపాగా ఎలాగో... తనకు బ్యాండ్ అంత పవిత్రమైనదని తెలిపారు.

తన అమ్మమ్మ వల్ల చిన్న తనం నుంచి తనలో భక్తి భావం ఉందని... పొద్దున్నే నాలుగు గంటలకు కాలువకు తీసుకెళ్లి, స్నానం చేయించి, అక్కడి నుంచి గుడికి తీసుకెళ్లేదని కోడి రామకృష్ణ చెప్పారు. అప్పటి నుంచి చేతికి తాడు, కంకణాలు కట్టుకోవడం అలవాటైందని తెలిపారు. తన స్నేహితుల్లో జ్యోతిష్యులు చాలా మంది ఉన్నారని... వారి సూచన మేరకు ఉంగరాలు ధరించడం అలవాటుగా మారిందని చెప్పారు. 

More Telugu News