kodi ramakrishna: తొలి చిత్రమే 525 రోజులు ఆడింది.. ఆ తర్వాత తిరుగులేని దర్శకుడిగా ఎదిగిన కోడి రామకృష్ణ!

  • చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ తొలి చిత్రం
  • 100కు పైగా చిత్రాలను తెరకెక్కించిన దర్శకదిగ్గజం
  • అర్జున్, భానుచందర్, సుమన్ లను పరిచయం చేసింది కోడి రామకృష్ణే

తెలుగు సినీకళామతల్లి మరో ముద్దు బిడ్డను కోల్పోయింది. సినిమాలే ప్రపంచంగా బతికి ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి, ఎందరినో గొప్ప నటీనటులుగా తీర్చిదిద్దిన దర్శకదిగ్గజం కోడి రామకృష్ణ ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు సినీపరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో కోడి రామకృష్ణ జన్మించారు. పాలకొల్లులోని లలిత కళాంజలి సంస్థ ద్వారా ఎన్నో నాటకాలలో నటించారు. 30 ఏళ్లకు పైగా సినీపరిశ్రమతో ఆయన జీవితం పెనవేసుకుపోయింది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలను కూడా ఆయన తెరకెక్కించారు. తన తొలి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవితో తీశారు. 1982లో 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'ను చిరంజీవి హీరోగా తన తొలి సినిమాగా తెరకెక్కించారు. అనంతరం వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2016లో కన్నడలో తీసిన 'నాగహారపు' చిత్రం ఆయన చివరి సినిమా.

తన తొలి చిత్రం 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య'తోనే కోడి రామకృష్ణ ఘన విజయం అందుకున్నారు. ఆ సినిమా ఏకంగా 525 రోజులు ఆడి సంచలనం సృష్టించింది. ఆ తర్వాత 'మంగమ్మగారి మనవడు', 'శత్రువు', 'ఆహుతి', 'ముద్దుల మావయ్య', 'దొంగాట', 'అంజి', 'దేవీపుత్రుడు', 'అరుంధతి', 'అమ్మోరు'లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవి, బాలకృష్ణలతో ఆయన పలు చిత్రాలను తెరకెక్కించారు.

ఒక దర్శకుడిగానే కాకుండా నటుడిగా కూడా కోడి రామకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 'ఆస్తి మూరెడు ఆశ బారెడు', 'అత్తగారూ స్వాగతం', 'మూడిళ్ల ముచ్చట', 'ఇంటి దొంగ' తదితర చిత్రాల్లో నటించారు. 1979 లో విడుదలైన 'కోరికలే గుర్రాలైతే' చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు.

'భారత్ బంద్' చిత్రం ద్వారా కాస్ట్యూమ్స్ కృష్ణను సినీ రంగానికి కోడి రామకృష్ణ పరిచయం చేశారు. 'కర్తవ్యం' సినిమాతో అప్పటి వరకు అందాలతారగా విరాజిల్లిన విజయశాంతిని 'లేడీ అమితాబ్' అని పిలిచే స్థాయికి చేర్చారు. తన సినిమాల్లో విలన్ ఎంట్రీని డిఫరెంట్ గా చూపించడం ఆయన స్టైల్. ఎక్కువగా కుటుంబ, మహిళా, గ్రామీణ కథానేపథ్యంలో సాగే చిత్రాలకు ప్రాధాన్యతను ఇచ్చిన ఆయన... గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్ తో కూడా సినిమాలు తీసి 'ఔరా' అనిపించుకున్నారు. 'అరుంధతి', 'అమ్మోరు', 'అంజి', 'దేవి', 'దేవీపుత్రుడు' తదితర చిత్రాలను గ్రాఫిక్స్ ఆధారంగా తెరకెక్కించారు.

అర్జున్, భానుచందర్, సుమన్, బాబూ మోహన్, గౌతమి తదితరులను సినీ పరిశ్రమకు పరిచయం చేసింది కోడి రామకృష్ణే. తన కెరీర్ లో 10 నంది అవార్డులు, 2 ఫిలింపేర్ పురస్కారాలను సొంతం చేసుకున్న ఆయన... 2012లో రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని అందుకున్నారు.

గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న కోడి రామకృష్ణ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఈరోజు తుదిశ్వాస విడిచారు.

More Telugu News