KCR: కేసీఆర్ కంటే ముందుగా సీఎం హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రుల వివరాలు!

  • తొలుత బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బెజవాడ గోపాలరెడ్డి
  • జాబితాలో కాసు బ్రహ్మానంద రెడ్డి, రోశయ్య
  • తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ రికార్డు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖను తనవద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రూ.1,82,017 కోట్ల భారీ బడ్జెట్ ను రూపొందించారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన వారు ఇంకా పలువురు వున్నారు.

ఆంధ్ర రాష్ట్ర సీఎంగా పనిచేసిన బెజవాడ గోపాలరెడ్డి 1955-56 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ను శాసన సభలో ప్రవేశపెట్టారు. ఆయన తర్వాత కాసు బ్రహ్మానందరెడ్డి 1968-69, 1969-70 కాలానికి సీఎం హోదాలో బడ్జెట్ ను శాసనసభ ముందు ఉంచారు. 2010-11 ఆర్థిక సంవత్సరానికి అప్పటి సీఎం కొణిజేటి రోశయ్య బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే తెలంగాణలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్ర సృష్టించారు.

ఇక దేశవ్యాప్తంగా యూపీలో 2013-14, 2015-16 కాలానికి అప్పటి సీఎం అఖిలేశ్ యాదవ్, కేరళలో 2016-17లో సీఎం ఊమెన్ చాందీ, కర్ణాటకలో 2017-18 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ ను ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

తాజాగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి దేశవ్యాప్తంగా నలుగురు ముఖ్యమంత్రులు బడ్జెట్ ను శాసనసభ ముందు ఉంచారు. కర్ణాటక సీఎం కుమారస్వామి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ భాఘెల్, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

More Telugu News