Andhra Pradesh: చంద్రబాబుతో పోటీ పడలేక ఏపీలో అలజడులు సృష్టించాలని జగన్-మోదీ ప్రయత్నిస్తున్నారు!: నారా లోకేశ్

  • ఏపీలో కులం పేరుతో కుట్రలు మొదలయ్యాయి
  • త్వరలోనే మతం పేరుతో విద్వేషాలు ప్రారంభం
  • హోదా, విభజన హామీల విషయంలో వెనక్కి తగ్గం

ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈరోజు వైసీపీ, బీజేపీలపై తీవ్రంగా మండిపడ్డారు. ఏపీలో ప్రస్తుతం కులం పేరుతో కుట్రలు మొదలుపెట్టారనీ, త్వరలోనే మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన హామీల అమలు విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు.

ఈరోజు ట్విట్టర్ లో లోకేశ్ స్పందిస్తూ..‘ప్రస్తుతం రాష్ట్రంలో కులం పేరుతో కుట్రలు మొదలుపెట్టారు. తరువాత మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. జగన్-మోదీ రెడ్డి ద్వయం ఎన్ని కుయుక్తులు పన్నినా, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చేవరకూ కేంద్రాన్ని, ప్రధాని మోదీగారిని నిలదీయడంలో వెనక్కి తగ్గేది లేదు’ అని ట్వీట్ చేశారు.

వైసీపీ అధినేత జగన్, ప్రధాని నరేంద్ర మోదీలను విమర్శిస్తూ..‘చంద్రబాబుగారి జెండా అభివృద్ధి, ఎజెండా సంక్షేమం. జగన్-మోదీ జోడి ఎన్నికల జెండా కులం. ఎజెండా మతం. అభివృద్ధి, సంక్షేమం విషయంలో చంద్రబాబుగారితో పోటీ పడలేమని డిసైడైపోయిన జగన్-మోదీ జోడి రాష్ట్రంలో అలజడులు సృష్టించాలని ప్రయత్నిస్తోంది’ అని ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.

More Telugu News