visakhapatnam: కంటిలో నులిపురుగు తిష్ఠ...ఆపరేషన్‌ చేసి వెలికి తీసిన వైద్యులు

  • మహిళ కనుగుడ్డు వెనుక 15 సెంటిమీటర్ల పురుగు
  • తీవ్రమైన నొప్పిరావడంతో విశాఖలోని శంకర్‌ఫౌండేషన్‌ ఆస్పత్రికి
  • పరీక్షల సమయంలో పురుగును గుర్తించిన డాక్టర్లు

కంటిలో నలుసు పడితేనే విలవిల్లాడిపోతాం. అలాంటిది ఏకంగా ఓ పొడవాటి పురుగే తిష్ఠవేసి ఉందంటే!... వింటేనే ఆశ్చర్యం కుగుతుంది. కానీ  ఓ మహిళ కంట్లో నేత్ర వైద్యులు 15 సెంటిమీటర్ల పొడవున్న నులి పురుగును గుర్తించి వెలికి తీయడం సంచలమైంది. విశాఖ జిల్లా పెందుర్తిలోని శంకర్‌ ఫౌండేషన్‌ నేత్ర వైద్యశాల వైద్యుల కథనం మేరకు వివరాలు ఇలావున్నాయి.

 విశాఖ నగర పరిధిలోని పెందుర్తికి చెందిన బి.భారతి గత కొంతకాలంగా తీవ్రమైన కంటి నొప్పితో బాధపడుతోంది. స్థానికంగా ఉన్న వైద్యులకు చూపించగా వారు మందులు రాసిచ్చారు. ఎన్ని మందులు వాడుతున్నా తాత్కాలిక ఉపశమనం తప్ప సమస్య తీరక పోవడంతో శంకర్‌ ఫౌండేషన్‌ వైద్యశాలకు వెళ్లింది. భారతికి పలు పరీక్షలు చేసిన వైద్యుడు భువన్‌ ఆమె కంటిలోపల పురుగులాంటిది ఉన్నట్లు గమనించారు. దీంతో విషయాన్ని సీనియర్‌ వైద్యురాలు నజరిన్‌ దృష్టికి తీసుకువెళ్లారు.

ఆమె కూడా పరీక్షలు నిర్వహించి కంటిలోపలి కదలికలను బట్టి ఏదో పురుగులాంటిది ఉందని, ఆపరేషన్‌ అవసరమని చెప్పి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. శస్త్రచికిత్సకు ముందు స్కానింగ్‌ చేసే సమయంలో పురుగు కనిపించ లేదు. అది లోపలికి వెళ్లిపోవడంతో ఆపరేషన్‌ వాయిదా వేశారు. వైద్యుల సూచన మేరకు బుధవారం ఆమెకు మళ్లీ సీటీ స్కాన్‌ చేశారు. ఆ రోజు రాత్రి కంటిలో ఏదో మళ్లీ కదులుతున్నట్లు అనిపించడంతో భారతి విషయాన్ని వైద్య సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లారు.

వారి సమాచారం మేరకు స్పందించిన డాక్టర్‌ నజరిన్‌ అప్పటికప్పుడు శస్త్రచికిత్సకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్‌ చేసి ఆమె కంటిలో ఉన్న 15 సెంటిమీటర్ల పొడవైన నులిపురుగును వెలికితీశారు. ఇన్నాళ్ల పాటు కంటిలో తిష్ఠవేసి పెరిగిన అంత పొడవాటి నులిపురుగును చూసి వైద్యులే ఆశ్చర్యపోయారు. శస్త్రచికిత్స అనంతరం నొప్పి నుంచి తనకు ఉపశమనం లభించడంతో భారతి వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

More Telugu News