Andhra Pradesh: న్యాయం కోసం కేంద్రాన్ని నిలదీస్తున్న చంద్రబాబుపై ఎదురు దాడి చేస్తారా?: అమిత్ షాపై కళా వెంకట్రావు ఫైర్

  • ప్రత్యేక హోదాపై ‘బీజేపీ ‘యూటర్న్’ తీసుకుంది
  • మోదీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు
  • చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు తగదు

ఏపీకి న్యాయం చేయాలని కేంద్రాన్ని నిలదీస్తున్న సీఎం చంద్రబాబుపై ఎదురుదాడి చేస్తారా? అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఏపీ మంత్రి కళా వెంకట్రావు ప్రశ్నించారు. ఈ మేరకు అమిత్ షాకు ఓ లేఖ రాశారు. ప్రత్యేక హోదా పదేళ్లు ఇవ్వాలన్న ‘బీజేపీ ‘యూటర్న్’ తీసుకుందని విమర్శించారు. ఏపీకి చేసిన మోసంపై సమాధానం చెప్పుకోలేకే తమపై విమర్శలు చేస్తున్నారని ఆ లేఖలో దుయ్యబట్టారు. మోదీ కక్ష పూరితంగా వ్యవహరిస్తూ చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, తన గురువుకే నామాలు పెట్టిన మోదీ, ‘వెన్నుపోటు’ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. విభజన హామీల అమలుపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు.

ఏపీకి వివిధ పద్దుల కింద రూ.14 వేల కోట్లు ఇచ్చినట్లు పార్లమెంట్ లో చెప్పారని, దీనిపై బీజేపీ నాయకులు తమ బహిరంగ సభల్లో తలా ఒక లెక్క చెబుతున్నారని విమర్శించారు. ఉమ్మడి సంస్థల విభజన ఇప్పటి వరకూ జరగలేదని విమర్శించారు. టీడీపీతో పొత్తు వల్లే బీజేపీకి 2014 ఎన్నికల్లో ఏపీలో 4 సీట్లు వచ్చాయని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందని అన్నారు. మోదీ నియంతృత్వాన్ని నిలువరించేందుకే దేశ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేశామని, రాబోయే ‘మహాకూటమి’ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆ లేఖలో కళావెంకట్రావు పేర్కొన్నారు.

More Telugu News