Pakistan: ​ సౌదీ యువరాజుకు బంగారు పూత పూసిన రైఫిల్ ను కానుకగా ఇచ్చిన పాకిస్థాన్

  • ఎంబీఎస్ ను ఆకట్టుకునేందుకు ఆపసోపాలు
  • అసాధారణ గిఫ్ట్ తో పాక్ సెనేటర్ల సంచలనం
  • ఆశ్చర్యపోయిన సౌదీ ప్రిన్స్

ఆర్థిక సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్న సమయంలో ఆపద్బాంధువుడిలా పాకిస్థాన్ లో పర్యటించాడు సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్. గల్ఫ్ దేశాల్లో ఎంబీఎస్ అని ముద్దుగా పిలుచుకునే ఈ యువరాజు పాక్ లో రెండ్రోజుల పాటు పర్యటించి అనేక రకాల సాయం ప్రకటించారు. వాటిలో అన్నిటికంటే ముఖ్యంగా రూ.14 వేల కోట్ల పెట్టుబడులకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం పాకిస్థాన్ కు ఇటీవల కాలంలో అతిపెద్ద ఊరట అని చెప్పాలి. కనీసం రోజువారీ ప్రభుత్వ ఖర్చులకు కూడా ఇతర దేశాల వైపు చూడాల్సిన స్థితిలో ఒక్కసారిగా వేల కోట్ల సాయం అప్పనంగా అందేసరికి పాక్ ఆనందం పరవళ్లు తొక్కుతోంది. ఆ పొంగిపొర్లే ఉత్సాహంలో పాక్ సెనేటర్ల బృందం సౌదీ యువరాజుకు అసాధారణ రీతిలో బంగారు పూత పూసిన అస్సాల్ట్ రైఫిల్ బహూకరించింది.

మొట్టమొదటిసారి పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన ఆయన తనకు లభించిన కానుక చూసి ఆశ్చర్యపోయారు. సెనేట్ చైర్మన్ నాయకత్వంలో పాక్ సెనేటర్లు ఓ కార్యక్రమంలో సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే ఆయనకు తమ దేశం తరపున అపూర్వ కానుక అందించారు. ఈ పర్యటన ఆసాంతం సౌదీ యువరాజును ఆకట్టుకునేందుకు పాక్ చేయని ప్రయత్నమంటూ లేదు. సుప్రసిద్ధ వంటకాలను పరిచయం చేయడంతో పాటు అపురూపమైన కానుకలు అందించడం వరకు ప్రతి విషయంలో తపించిపోయింది.

More Telugu News